అలకబూనిన బరాదర్‌!

ప్రధానాంశాలు

Published : 17/09/2021 05:04 IST

అలకబూనిన బరాదర్‌!

తాలిబన్లలో విభేదాలు మరింత తీవ్రం

కాబుల్‌: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అఫ్గానిస్థాన్‌ను మళ్లీ తమ వశం చేసుకున్న తాలిబన్లు ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తాత్కాలిక కేబినెట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ ఘర్షణ మరింత పెరిగినట్లు సమాచారం. 1990ల్లో అధికారంలో ఉన్నప్పుడు అఫ్గాన్‌లో తాలిబన్లు అరాచక పాలన సాగించారు. ఈ దఫా అలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించబోమని ఇటీవల దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత హామీలిచ్చారు. అన్ని వర్గాలను కలుపుకొని సమ్మిళిత ప్రభుత్వం/కేబినెట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రస్తుత కేబినెట్‌లోని వారంతా కరడుగట్టిన తాలిబన్లు, హక్కానీ నెట్‌వర్క్‌ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులు. ఈ కూర్పుపై తాలిబన్లలోని ఆచరణవాదులు, సిద్ధాంతకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య దేశాధ్యక్ష భవనంలో పెద్ద గొడవ జరిగిందని.. ఆచరణవాదుల వర్గానికి నేతృత్వం వహిస్తున్న ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ అందులో మృత్యువాతపడ్డారని కూడా ఇటీవల వార్తలొచ్చాయి. తాను బతికే ఉన్నానంటూ తొలుత ఓ ప్రకటన విడుదల చేసిన బరాదర్‌.. బుధవారం టీవీలో కూడా కనిపించారు. తన ఆకాంక్షలకు విరుద్ధంగా కేబినెట్‌ ఏర్పాటు కావడం బరాదర్‌కు నచ్చడం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అందుకే ఉప ప్రధాని పదవిలో కొనసాగుతున్నప్పటికీ పలు అధికారిక కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని తెలిపాయి. తమ రాజకీయ కార్యకలాపాలకు గత కొన్నేళ్లుగా వేదికగా ఉన్న కతర్‌ నుంచి ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుర్‌ రహమాన్‌ అల్‌-థనీ తాజాగా అఫ్గాన్‌ పర్యటనకు రాగా.. ఆయనకు స్వాగతం పలికేందుకూ బరాదర్‌ రాకపోవడాన్ని గుర్తుచేశాయి. అమెరికాతో చర్చల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం అలకబూని ఇలా దూరందూరంగా వ్యవహరించడం తాలిబన్‌ సర్కారుకు ఇబ్బందికరంగా మారే అవకాశముందని పేర్కొన్నాయి.

అఫ్గాన్‌ వ్యవహారాలపై ఎస్‌సీవోతో కలిసి పనిచేస్తాం: చైనా

బీజింగ్‌: అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులను చక్కదిద్దే దిశగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాలతో కలిసి కృషిచేస్తామని చైనా తెలిపింది. ఈ మేరకు వాటితో ఎప్పటికప్పుడు చర్చలు, సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. తజికిస్థాన్‌ రాజధాని దుశాంబే వేదికగా ఎస్‌సీవో 21వ శిఖరాగ్ర సదస్సు శుక్రవారం జరగనుంది. అఫ్గాన్‌ వ్యవహారాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్థాన్‌ పరిస్థితులు ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై ప్రభావం చూపుతాయి. భారత్‌ సహా ఎస్‌సీవోలోని సభ్య దేశాలన్నీ అఫ్గాన్‌కు ఇరుగుపొరుగు దేశాలే. అఫ్గాన్‌లో సమ్మిళిత రాజకీయ వేదికను ఏర్పాటుచేసే విషయంలో ఎస్‌సీవో సభ్య దేశాలతో కలిసి కృషి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన