‘మూడో’ మాటకు ఇప్పుడు తావులేదు

ప్రధానాంశాలు

Published : 19/09/2021 05:10 IST

‘మూడో’ మాటకు ఇప్పుడు తావులేదు

భారత్‌లో బూస్టర్‌ డోసుపై నిపుణుల వ్యాఖ్యలు

దిల్లీ: కొవిడ్‌-19 సమర్థ కట్టడికి బూస్టర్‌ డోసు అవసరమా? దీనివల్ల మహమ్మారి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందా? భారత్‌లో ఇది చర్చనీయాంశమైంది. దేశ జనాభాలో ఎక్కువ శాతం మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు పొందినప్పుడు మాత్రమే మూడో డోసు ఆలోచన బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అర్హుల్లో నాలుగో వంతు కన్నా తక్కువ మంది మాత్రమే రెండు డోసులకు నోచుకున్న పరిస్థితుల్లో అది సబబు కాదని పేర్కొంటున్నారు. దాదాపు అందరికీ కనీసం ఒక్క డోసైనా ఇచ్చేలా చూడాలన్నారు. అధికారికంగా భారత్‌లో మూడో డోసుకు ఇంకా అనుమతించలేదు. భారతీయుల్లో అతికొద్ది మందే రెండు డోసులు పొందారని దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ శాస్త్రవేత్త సత్యజిత్‌ రథ్‌ పేర్కొన్నారు. ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఎక్కువగా ఉన్న చాలామందికి ఇంకా పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ జరగలేదన్నారు. ‘‘పరిస్థితి ఇలా ఉంటే.. ‘అదృష్టవంతులైన’ అతికొద్దిమందికి ఇప్పుడు మూడో డోసు ఇవ్వాలన్న ఆలోచన నైతికంగా సరికాదు. పైగా ఈ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఎవరికి ఎక్కువగా పొంచి ఉందన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి కొవిడ్‌ సోకితే అది తీవ్రరూపం దాల్చవచ్చని మనకు అర్థమవుతోంది. అలాంటివారికి రెండు టీకా డోసుల ద్వారా ఈ ఇబ్బందిని తప్పించొచ్చు’’ అని వివరించారు. వ్యాక్సిన్లు పొందినవారిలో కొంతకాలానికి యాంటీబాడీలు తగ్గుతున్నప్పటికీ.. దాన్నిబట్టి టీకా సమర్థత తగ్గుతున్నట్లు చెప్పలేమన్నారు. అర్హులైన జనాభాలో 40 శాతం మంది ఇంకా మొదటి డోసు కూడా పొందని దశలో ‘బూస్టర్‌’ గురించి భారత్‌ ఆలోచించరాదని పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో ఇమ్యునాలజిస్టు వినీతా బాల్‌ పేర్కొన్నారు. అయితే తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారికి కేసులవారీగా మూడో డోసును ఇచ్చే అంశాన్ని పరిశీలించొచ్చని ఆమె సూచించారు. ‘‘టీకా పొందినవారు.. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ నుంచి కూడా సమర్థంగా ఎదుర్కోగలరని పరిశోధన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల మూడో డోసు గురించి ఇప్పుడు ఆలోచించడం స్వార్థపూరితమని నాకు అనిపిస్తోంది’’ అని ఆమె తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన