భూకక్ష్యలోకి పర్యాటక యాత్ర దిగ్విజయం

ప్రధానాంశాలు

Updated : 20/09/2021 05:47 IST

భూకక్ష్యలోకి పర్యాటక యాత్ర దిగ్విజయం

క్షేమంగా తిరిగొచ్చిన నలుగురు యాత్రికులు

కేప్‌ కెనావెరాల్‌: పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో తొలిసారిగా భూ కక్ష్యలోకి జరిగిన అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా సాగింది. మూడు రోజుల పాటు రోదసిలో గడిపిన నలుగురు యాత్రికులు ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. వీరు ప్రయాణించిన ‘క్రూ డ్రాగన్‌’ వ్యోమనౌక నిర్దేశిత రీతిలో ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్‌ మహాసముద్ర జలాల్లో దిగింది. పూర్తిస్థాయి వ్యోమగాముల తోడ్పాటు లేకుండానే పర్యాటకులు భూ కక్ష్యలో పరిభ్రమించి రావడం ఇదే మొదటిసారి.

స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ‘క్రూ డ్రాగన్‌’ వ్యోమనౌకలో ఈ యాత్రికులు గత బుధవారం రాత్రి అమెరికాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పయనమైన సంగతి తెలిసిందే. అపర కుబేరుడు జేర్డ్‌ ఇజాక్‌మన్‌ నేతృత్వంలో హేలీ ఆర్సినో, క్రిస్‌ సెంబ్రోస్కీ, సియాన్‌ ప్రాక్టర్‌లు ఇందులో పాల్గొన్నారు. ఈ యాత్రకైన ఖర్చు మొత్తం ఇజాక్‌మన్‌ భరించారు. సముద్ర జలాలను తాకడానికి ముందు క్రూ డ్రాగన్‌లోని నాలుగు పారాచూట్లు విచ్చుకొని, వేగాన్ని తగ్గించాయి. స్పేస్‌ఎక్స్‌కు సంబంధించిన పడవలు వచ్చి.. వ్యోమనౌకను సముద్రం నుంచి వెలికితీశాయి. ‘క్రూ డ్రాగన్‌’ ద్వారం తెరుచుకున్నాక.. చిరునవ్వులు చిందిస్తూ ఆర్సినో (29) మొదట బయటకు వచ్చారు.

‘‘అంతరిక్షం మనందరికీ చెందుతుందని మీ యాత్ర రుజువు చేసింది’’ అని స్పేస్‌ఎక్స్‌ మిషన్‌ కంట్రోల్‌ అధికారి కమ్యూనికేషన్‌ సాధనంలో వ్యాఖ్యానించారు. ‘‘ఇదో అద్భుత యాత్ర. ఇది ఆరంభం మాత్రమే’’ అని ఇజాక్‌మన్‌ బదులిచ్చారు. మరిన్ని ప్రైవేటు యాత్రలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తన జీవితంలోనే అత్యుత్తమ ప్రయాణమని ప్రాక్టర్‌ ట్వీట్‌ చేశారు. 1969లో ‘అపోలో-9’ యాత్ర తర్వాత ఒక వ్యోమనౌక అట్లాంటిక్‌ మహాసముద్రంలో దిగడం ఇదే మొదటిసారి.

అసాధారణం..

ఈ యాత్రలో డ్రాగన్‌ వ్యోమనౌక అసాధారణ స్థాయిలో 585 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. వ్యోమనౌకలో గుమ్మటంలా ఉన్న ఒక గాజు కిటికీ గుండా నలుగురు యాత్రికులు విశ్వ వీక్షణం చేశారు. హేలీ ఆర్సినో.. టెన్నెసీలోని సెయింట్‌ జూడ్‌ చిల్డ్రన్స్‌ రీసెర్చ్‌ ఆసుపత్రిలో వైద్య సహాయకురాలిగా పనిచేస్తున్నారు. చిన్నతనంలో ఆమె ఇదే ఆసుపత్రిలో ఎముక క్యాన్సర్‌కు చికిత్స పొందారు. రోదసిలోకి వెళ్లిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. కృత్రిమ అవయవంతో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా ఆర్సినో కాలికి లోహపు ఎముకను అమర్చాల్సి వచ్చింది. రోదసి నుంచి ఆమె.. తన ఆసుపత్రిలోని క్యాన్సర్‌ చికిత్స పొందుతున్న పిల్లలతో మాట్లాడారు. ‘‘చిన్నతనంలో నేను కూడా మీలానే క్యాన్సర్‌తో పోరాడా. దాని నుంచి కోలుకొని ఇప్పుడు రోదసియాత్ర చేయగలిగా. భవిష్యత్‌లో మీరూ ఇలాంటివి చేయగలరు’’ అంటూ స్ఫూర్తి నింపారు. హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌తోనూ ఈ యాత్రికులు రోదసి నుంచి మాట్లాడారు. ఆయన కూడా తన సినిమా చిత్రీకరణ కోసం స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు.

చిన్న ఇబ్బందులే..

ఈ అంతరిక్షయాత్రలో పర్యాటకుల జీవితం చాలావరకూ సాధారణంగానే గడిచింది. వారి ఆహారం కూడా విభిన్నంగా ఏమీ లేదు. కోల్డ్‌ పిజా, శాండ్‌విచ్‌లు, పాస్తా బొలోగ్నెస్‌, మెడిటరేనియన్‌ ల్యాంబ్‌ వంటివి భుజించారు. తిరుగుప్రయాణానికి ముందు సెంబ్రోస్కీ చాలా కులాసాగా కనిపించారు. తాపీగా తన ట్యాబ్‌లో ‘స్పేస్‌ బాల్స్‌’ అనే సినిమాను ఆస్వాదించారు. వ్యోమనౌక టాయ్‌లెట్‌లోని ఫ్యాన్‌, ఒక ఇంజిన్‌లో ఉష్ణోగ్రతను తెలియజేసే సెన్సర్‌ మొరాయించడం మినహా యాత్ర మొత్తం సాఫీగా సాగింది. రోదసిలో ఉన్నప్పుడు యాత్రికుల గుండె స్పందన రేటు, నిద్ర, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి, విషయ గ్రహణ సామర్థ్యానికి సంబంధించి డేటాను పరిశోధకులు తీసుకున్నారు. భవిష్యత్‌ అంతరిక్షయాత్రల కోసం దీన్ని ఉపయోగిస్తారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన