అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌ కుంద్రాకు బెయిల్‌

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 06:19 IST

అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌ కుంద్రాకు బెయిల్‌

అతని సహాయకుడు ర్యాన్‌ థోర్పేకు కూడా

ముంబయి: బాలీవుడ్‌ నటీమణి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో సోమవారం స్థానిక మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. అశ్లీల చిత్రాలను రూపొందించి, యాప్‌ల ద్వారా విడుదల చేస్తున్నారన్న ఆరోపణపై జులై 19న అరెస్టైన కుంద్రా అప్పటి నుంచి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కుంద్రాతోపాటు అరెస్టైన ర్యాన్‌ థోర్పేకు సైతం బెయిలు లభించింది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన అనుబంధ అభియోగపత్రంలో తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యమూ లేదని ఇటీవల సమర్పించిన బెయిలు దరఖాస్తులో రాజ్‌కుంద్రా పేర్కొన్న సంగతి తెలిసిందే.

మీడియా కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయ్‌: బాంబే హైకోర్టు

రాజ్‌కుంద్రా అరెస్టు తర్వాత శిల్పాశెట్టి మైనర్‌ సంతానానికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు తమను ఆందోళనకు గురిచేశాయని బాంబే హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఈ మేరకు శిల్పాశెట్టి దాఖలుచేసిన కేసుపై న్యాయమూర్తి జస్టిస్‌ గౌతమ్‌ పటేల్‌ సోమవారం విచారణ చేపట్టారు. జులై నెలలో రాజ్‌కుంద్రా అరెస్టు తర్వాత తన, తన కుటుంబం పరువుకు భంగం కలిగించే రీతిలో అనేక కథనాలు, వీడియోలు మీడియాలో వచ్చినట్లు శిల్పాశెట్టి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటివి ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా మీడియాను నిరోధించాలని అభ్యర్థించారు. మరోవైపు, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న.. మీడియా సంస్థలు, బ్లాగులు, వ్లోగులు నడుపుతున్న ప్రైవేటు వ్యక్తులతో తాము మాట్లాడుతున్నామని, వారిలో చాలామంది అభ్యంతరకర సమాచారాన్ని తొలగించేందుకు అంగీకరించారని నటీమణి తరఫు న్యాయవాది చంద్రచూడ్‌ సోమవారం న్యాయస్థానానికి నివేదించారు. అనంతరం న్యాయమూర్తి అక్టోబరు ఒకటో తేదీకి విచారణను వాయిదా వేశారు. అభ్యంతరకర సమాచారానికి సంబంధించి ప్రతివాదులుగా ఉన్నవారిని ప్రైవేటు బ్లాగర్లు, వ్లోగరు, సంప్రదాయ మీడియా సంస్థలుగా (రెండు రకాలుగా) వర్గీకరించాలని చంద్రచూడ్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణకు ఎందుకు అంత తొందర? అని ప్రశ్నించింది. ‘‘నేను శిల్పాశెట్టి గురించి ఆందోళన చెందట్లేదు. సమస్యను ఆమె ఎదుర్కోగలరు. ఆమె మైనర్‌ చిన్నారుల గురించే నా ఆందోళన అంతా. శిల్పాశెట్టి వ్యక్తిగత జీవితం, ఆమె చిన్నారులపై వచ్చిన మీడియా కథనాలే ఆందోళనకరంగా ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో చిన్నారులే కేంద్ర బిందువులుగా మారతారు’’ అని జస్టిస్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన