తీవ్రస్థాయి కొవిడ్‌ బాధితులకు యాంటీబాడీ చికిత్స

ప్రధానాంశాలు

Published : 25/09/2021 04:58 IST

తీవ్రస్థాయి కొవిడ్‌ బాధితులకు యాంటీబాడీ చికిత్స

డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు

దిల్లీ: కొవిడ్‌-19తో ఆసుపత్రిపాలయ్యే ముప్పు ఉన్న బాధితులకు.. వ్యాధి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నవారికి.. రెండురకాల యాంటీబాడీ చికిత్సలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సిఫార్సు చేసింది. ఈ రెండు రకాల రోగులకు కాసిరివిమాబ్‌, ఇండెవిమాబ్‌లను అందించొచ్చని సూచించింది. సంస్థలోని ‘గైడ్‌లైన్‌ డెవ్‌లెప్‌మెంట్‌ గ్రూప్‌’ (జీడీజీ) కమిటీ ఈ మేరకు తాజా మార్గదర్శకాలు ఇచ్చింది.

మొదటిరకం బాధితుల్లో వ్యాధి అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. అయితే వారికి ఆసుపత్రిపాలయ్యే ముప్పు మాత్రం ఎక్కువగా ఉంటుంది. రెండో రకం బాధితులు అప్పటికే తీవ్రస్థాయి కొవిడ్‌ బారినపడి ఉంటారు. అయితే వీరు సీరోనెగెటివ్‌ రోగులు. అంటే.. వీరిలో యాంటీబాడీ స్పందన ఇంకా ఆరంభమై ఉండదు.

* మూడు ప్రయోగాల్లో లభించిన కొత్త ఆధారాల ప్రాతిపదికన మొదటి సూచనను జీడీజీ చేసింది. ఈ తరహా బాధితులకు ఆసుపత్రిపాలయ్యే ముప్పును కాసిరివిమాబ్‌, ఇండెవిమాబ్‌లు తగ్గించొచ్చని వాటిలో వెల్లడైంది. టీకా పొందనివారు, వయోధికులు, వైద్య చికిత్సలో భాగంగా రోగనిరోధక స్పందనను కట్టడి చేయాల్సిన వారు ఇందులో ఉంటారు.

* అలాగే సీరోనెగెటివ్‌ రోగుల్లో ఈ రెండు రకాలు యాంటీబాడీలు మరణాలు, మెకానికల్‌ వెంటిలేషన్‌ అవసరాన్ని తప్పించే అవకాశం ఉందని మరో ప్రయోగంలో తేలింది. అవి తీవ్రస్థాయిలో అనారోగ్యంపాలైన ప్రతి వెయ్యి మందిలో 49 మరణాలను, చాలా తీవ్రస్థాయిలో అనారోగ్యంపాలైనవారిలో 87 మరణాలను తగ్గించాయని వెల్లడైంది.

* ఈ రెండురకాల వారు కాకుండా మిగతావారికి ఈ చికిత్సతో ఒనగూరే ప్రయోజనాలు పెద్దగా ఉండకపోవచ్చని జీడీజీ పేర్కొంది.

కాసిరివిమాబ్‌, ఇండెవిమాబ్‌లు మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సలు. వీటిని కలిపి వాడినప్పుడు కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌కు అంటుకుంటాయి. తద్వారా మానవ కణాలకు ఇన్‌ఫెక్షన్‌ కలిగించే వైరస్‌ సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి. అయితే ఈ చికిత్సకయ్యే ఖర్చు, అవసరమయ్యే ఇతర వనరులు ఎక్కువేనని జీడీజీ అంగీకరించింది. అందువల్ల అల్ప, మధ్యాదాయ దేశాలకు ఈ చికిత్సను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంలో సవాళ్లు తలెత్తవచ్చని వివరించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన