కమలా హారిస్‌కు అపూర్వ కానుకలు

ప్రధానాంశాలు

Updated : 25/09/2021 06:11 IST

కమలా హారిస్‌కు అపూర్వ కానుకలు

ముఖాముఖీ భేటీలో అందజేసిన ప్రధాని మోదీ

వాషింగ్టన్‌/దిల్లీ: భారతీయ మూలాలున్న మహిళ, అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు చిరకాలం గుర్తుండిపోయే అపురూపమైన కానుకలను ప్రధాని మోదీ అందజేశారు. ఆమె తాత, తమిళనాడుకు చెందిన పీవీ గోపాలన్‌ భారత ప్రభుత్వ అధికారిగా చేసినప్పటి స్మృతులను గుర్తుకు తెచ్చేలా చెక్కపై చేతితో చెక్కిన అమూల్యమైన పత్రాలను అందించారు. వారణాసి చేతివృత్తుల కళాకారుల నైపుణ్యాన్ని చాటే ‘గులాబి మీనాకారి చెస్‌ బోర్డునూ బహూకరించారు. కమల తల్లి శ్యామలాగోపాలన్‌కు పీవీ గోపాలన్‌ తండ్రి. ప్రభుత్వాధికారిగా గోపాలన్‌ వివిధ హోదాల్లో పనిచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తన రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌తో శ్వేత సౌధంలో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ఫోన్‌ ద్వారా పలుదఫాలు మాట్లాడుకున్నప్పటికీ ముఖాముఖీ సమావేశం అవడం ఇదే ప్రథమం. భారత, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. అఫ్గానిస్థాన్‌ సహా ప్రపంచ రాజకీయ పరిణామాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు పొంచి ఉన్న ముప్పు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని పరిస్థితులపై వారు చర్చించుకున్నారు. ఆ తర్వాత సంయుక్తంగానూ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ..‘భారత్‌, అమెరికా సహజ భాగస్వాములు. ఒకే విధమైన విలువలు, భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలు కలిగిన దేశాలు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ప్రజాస్వామ్య వ్యవస్థలు కలిగిన ఈ దేశాల మధ్య సమన్వయం, సహకారం క్రమంగా వృద్ధిచెందుతోంది’ అని తెలిపారు. ‘ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచార’ంటూ కమలాహారిస్‌ను మోదీ ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ ప్రభుత్వ హయాంలో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు సమున్నత స్థాయికి వృద్ధిచెందుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా రెండో దశ మహమ్మారి ఉద్ధృతి సమయంలో చేయూతనందించిన అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత పర్యటనకు రావాల్సిందిగా కమలాహారిస్‌ను ఆహ్వానించారు.

పాక్‌కు కమల హెచ్చరిక
భారత్‌ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామని కమలాహారిస్‌ తెలిపారు. త్వరలో విదేశాలకు కరోనా టీకాలు ఎగుమతి చేస్తామన్న భారత్‌ ప్రకటనను ఆమె స్వాగతించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ సమయంలో ఆమే స్వయంగా పాకిస్థాన్‌లో ఉగ్రవాద ముఠాలు పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉగ్రమూకల వల్ల భారత్‌, అమెరికా భద్రతకు హానికలగకుండా తగు చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు ఆమె సూచించారని భారత విదేశీవ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా విలేకరులకు తెలిపారు.

ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులకూ బహుమతులు
క్వాడ్‌ దేశాల నేతలైన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిదె సుగాలతో వాషింగ్టన్‌లో విడివిడిగా భేటీ అయిన సమయంలోనూ నరేంద్ర మోదీ వారిద్దరికీ కానుకలను అందజేశారు. మోరిసన్‌కు వెండితో చేసిన వర్ణరంజితమైన ‘గులాబి మీనాకారి నౌక’ను, యోషిహిదె సుగాకు చందనపు చెక్కతో చేసిన గౌతమ బుద్ధుని ప్రతిమను బహూకరించారు. భారతీయ కళాకారులు.. ప్రత్యేకించి వారణాసి చేతివృత్తి నిపుణుల పనితనానికి ఇవి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. జపాన్‌ ప్రధానితో చర్చల్లో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో సహకారం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయని అధికారులు వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన