క్వాడ్‌తో విశ్వశాంతి

ప్రధానాంశాలు

Published : 25/09/2021 05:01 IST

క్వాడ్‌తో విశ్వశాంతి

అంతర్జాతీయ శ్రేయస్సుకు కూటమి దోహదం
ప్రధాని మోదీ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: క్వాడ్‌ కూటమి ప్రపంచ శాంతికి బాటలు పరుస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ శ్రేయస్సుకు అది తోడ్పడుతుందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిడె సుగాలతో కలిసి శ్వేతసౌధంలో శుక్రవారం క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఆ కూటమి దేశాధినేతలు వర్చువల్‌ విధానంలో కాకుండా నేరుగా భేటీ కావడం ఇదే తొలిసారి. కొవిడ్‌, పర్యావరణమార్పులు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లు సహా పలు అంశాలపై వారు చర్చించారు.  సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘‘క్వాడ్‌లో మనం అందించుకుంటున్న పరస్పర సహకారం ఇండో-పసిఫిక్‌ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతిస్థాపనకు, అంతర్జాతీయ సౌభాగ్యానికి దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నా. ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేసే శక్తి- మన కూటమి. క్వాడ్‌ రూపొందించిన టీకా కార్యక్రమం ఇండో-పసిఫిక్‌ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 2004లో జపాన్‌లో సునామీ విధ్వంసం సృష్టించినప్పుడు మనం కలిసికట్టుగా పనిచేశాం. మళ్లీ ఇప్పుడు కరోనా విపత్తు వేళ మానవత్వ పరిరక్షణకు క్వాడ్‌ రూపంలో ఒక్కటిగా కృషిచేస్తున్నాం. అంతర్జాతీయ భద్రత, సరఫరా గొలుసు, పర్యావరణ మార్పులు, కొవిడ్‌ వంటి అంశాల్లో సభ్య దేశాలతో కలిసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. బైడెన్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌, పర్యావరణ మార్పుల వంటి ఉమ్మడి సవాళ్లను అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ కలిసికట్టుగా ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఘర్షణలు చోటుండకూడదని మోరిసన్‌ ఆకాంక్షించారు. అంతకుముందు, క్వాడ్‌ సదస్సుపై శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి కూటమి కొత్త కార్యబృందాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని తెలిపింది. ‘5జి’ సాంకేతికత విస్తరణ కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించొచ్చని పేర్కొంది. అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో క్వాడ్‌ దేశాల విద్యార్థులు స్టెమ్‌ కోర్సుల్లో విద్యనభ్యసించేందుకు వీలుగా సరికొత్త ఫెలోషిప్‌ను తీసుకురానున్నట్లు అంచనా వేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన