ఈడబ్ల్యూఎస్‌ దావాలన్నీ సుప్రీంకు

ప్రధానాంశాలు

Updated : 25/09/2021 05:25 IST

ఈడబ్ల్యూఎస్‌ దావాలన్నీ సుప్రీంకు

కేరళ హైకోర్టులోని వ్యాజ్యంపై స్టే
జస్టిస్‌ రమణ ధర్మాసనం ఆదేశం

దిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10% రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన దావాపై కేరళ హైకోర్టు విచారణ జరపకుండా శుక్రవారం సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఇలాంటి వ్యాజ్యమే తన పరిశీలనలో ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొంది. కేరళ హైకోర్టులో నుజాయిం పి.కె. ఈ రిజర్వేషన్ల విషయమై వ్యాజ్యం వేశారు. ఈ అంశాన్నే సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల ధర్మాసనం పరిశీలిస్తోందని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ‘‘ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ 103వ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉందా? అన్న ప్రశ్న సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. అందువల్ల హైకోర్టు పరిధిలోని వ్యాజ్యాన్ని ఇక్కడికి బదలాయించి కలిపి విచారిస్తాం. పరస్పర విరుద్ధమైన తీర్పులు లేకుండా చూస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. 


మద్రాసు హైకోర్టు వ్యాఖ్యల కొట్టివేత

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల విషయమై మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైద్య కళాశాలల్లో అఖిల భారత కోటా కింద ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. నీట్‌లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేయడం లేదంటూ కేంద్రంపై డీఎంకే దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై నిర్ణయం వెలువరించిన సందర్భంగా ఆ వ్యాఖ్య చేసింది. ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున కేంద్రం కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. హైకోర్టు వ్యాఖ్యపై కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పీలు చేయగా, న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై హైకోర్టు చేసిన వ్యాఖ్యను తొలగించింది. ‘‘ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు చెందిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. అందువల్ల దీనిపై నిర్ణయం తీసుకునే ముందు సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఒక్క ఓబీసీ రిజర్వేషన్ల అంశమే హైకోర్టు ముందుకు వచ్చినందున ఈడబ్ల్యూఎస్‌పై అభిప్రాయం చెప్పాల్సిన అవసరమే లేదు. అలా చెప్పడం ద్వారా పరిధిని అతిక్రమించింది. దాంతో ఆ వ్యాఖ్య వరకు తొలగిస్తున్నాం’’ అని పేర్కొంది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై ప్రధాన దావాల విచారణ అక్టోబరు 7న జరుగుతుందని తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన