65 గంటలు.. 20 భేటీలు

ప్రధానాంశాలు

Updated : 27/09/2021 06:20 IST

65 గంటలు.. 20 భేటీలు

అమెరికాలో తీరిక లేకుండా గడిపిన మోదీ

విమాన ప్రయాణాల్లో మరో నాలుగు సమావేశాలు

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఏమాత్రం తీరిక లేకుండా గడిపారు. అంతర్జాతీయ స్థాయి నేతలు, పలువురు ఇతర ప్రముఖులతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. మొత్తంగా అగ్రరాజ్యంలో 65 గంటల పాటు ఉన్న మోదీ.. 20 సమావేశాలకు హాజరయ్యారు. విమాన ప్రయాణంలో ఉండగా పాల్గొన్న 4 సుదీర్ఘ భేటీలు వీటికి అదనం. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధాని ఈ నెల 22న అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఆ ప్రయాణంలో ఉండగా రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. అగ్రరాజ్యంలో హోటల్‌కు చేరుకున్నాక మూడు భేటీలకు హాజరయ్యారు. 23న ఐదుగురు సీఈవోలతో విడివిడిగా సమావేశమయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, జపాన్‌ ప్రధాని యోషిహిదే, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌లతో వేర్వేరుగా చర్చలు జరిపారు. మూడు అంతర్గత సమావేశాల్లో పాల్గొన్నారు. మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ద్వైపాక్షిక భేటీ జరిగింది. క్వాడ్‌ సమావేశానికీ హాజరయ్యారు. అదేరోజు అంతర్గత భేటీల్లోనూ పాల్గొన్నారు. 25న ఐరాస సమావేశంలో ప్రసంగించారు. భారత్‌కు తిరుగుప్రయాణమయ్యారు. విమానంలో వస్తూ.. మరో రెండు సమావేశాల్లో పాల్గొన్నారు.

అలసట దరిచేరనివ్వరు

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తీరిక లేకుండా గడపడం కొత్తేమీ కాదు. వరుసగా భేటీల్లో పాల్గొంటున్నా.. ఆయన ఎప్పుడూ తాజాదనంతో ఉంటారు. అలసట అన్న ఊసు కూడా మనసులో తలెత్తకుండా ఉండేందుకే.. మోదీ వరుస సమావేశాలను ఏర్పాటుచేసుకుంటుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘‘1990ల్లో మోదీ అమెరికాకు తరచూ వెళ్లేవారు. అప్పుడు ఓ విమానయాన సంస్థ భారీ రాయితీపై నెలవారీ ప్రయాణ పాస్‌ను అందించేది. దాని ప్రయోజనాలను గరిష్ఠంగా పొందేందుకు మోదీ ఎప్పుడూ రాత్రివేళల్లో ప్రయాణం చేసేవారు. విమానాలు, విమానాశ్రయాల్లోనే రాత్రుళ్లను గడిపేవారు. కాబట్టి హోటళ్లలో బస చేయడానికి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది కాదు’’ అని వివరించాయి.

గమ్యస్థాన టైమ్‌జోన్‌తో సరిపోయేలా..

‘‘విమానం ఎక్కిన వెంటనే మోదీ తన శరీరాన్ని, నిద్రను.. గమ్యస్థాన టైమ్‌జోన్‌కు అనుగుణంగా మార్చుకుంటారు. ఆయన భారత్‌లో రాత్రివేళ బయలుదేరితే.. గమ్యస్థానానికి చేరుకునేసరికి ఉదయం/పగలు అయినా అక్కడ నిద్రపోరు. వెంటనే పనులు మొదలుపెట్టేస్తారు. తిరుగు ప్రయాణాల్లోనూ అంతే. ఉదయం/పగటి వేళ భారత్‌కు చేరుకోవాల్సి వస్తే.. తాజాదనంతో మళ్లీ పనుల్లో నిమగ్నమయ్యేలా తనను తాను సిద్ధం చేసుకుంటారు’’ అని తెలిపాయి.


మోదీకి ఘన స్వాగతం

అమెరికా పర్యటనను ముగించుకొని స్వదేశానికి వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా సహా పలువురు పార్టీ నేతలు, వేల మంది కార్యకర్తలు ఆదివారం దిల్లీ విమానాశ్రయానికి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. మోదీని అంతర్జాతీయ నేతగా నడ్డా అభివర్ణించారు. భారత్‌ కోసమే కాకుండా యావత్‌ ప్రపంచ అభివృద్ధి కోసం ఆయన కృషిచేస్తున్నారని ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీకి పాత స్నేహం ఉందని.. అందుకే పలు విషయాలపై వారిద్దరూ నిర్మొహమాటంగా మాట్లాడుకోగలిగారని పేర్కొన్నారు. తనకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చినవారందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన