సైనికుల వల్లే దేశం సురక్షితం

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:28 IST

సైనికుల వల్లే దేశం సురక్షితం

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జైసల్మేర్‌, జోధ్‌పుర్‌, ఈనాడు, జైపుర్‌: సరిహద్దుల్లోని సైనికుల వల్లే భారతదేశం సురక్షితంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన జైసల్మేర్‌లోని యుద్ధ ప్రదర్శనశాలను సందర్శించారు. అమర సైనికులకు నివాళులు అర్పించారు. ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) 191వ బెటాలియన్‌ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి అక్కడి సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు జైసల్మేర్‌లో సైనిక సిబ్బందిని ఉద్దేశించి కూడా ప్రసంగించారు. సమాచార, సైబర్‌ స్పేస్‌ వంటి అంశాల్లో సాయుధ బలగాలు పైచేయి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో సంప్రదాయ యుద్ధ సన్నద్ధతను కాపాడుకోవాలని స్పష్టం చేశారు. భౌగోళిక వ్యూహాత్మక వాతావరణం అనూహ్యంగా మారిపోతోందని, అంతర్గతంగానూ, బహిర్గతంగానూ దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జమ్మూ-కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని పునరుద్ఘాటించిన వెంకయ్యనాయుడు, అధికరణం 370 అనేది తాత్కాలికమైనదని స్పష్టం చేశారు. జమ్మూ-కశ్మీర్‌కు, మిగతా భారతదేశానికి మధ్యనున్న అడ్డంకిని పార్లమెంటు తొలగించిందని చెప్పారు.

జైసల్మేర్‌ సందర్శన సంతోషం కలిగించింది

జైసల్మేర్‌ను సందర్శించడం తనకు ఆనందం కలిగించిందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ నగరం రాజస్థాన్‌ సంస్కృతి, సైనిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. జోధ్‌పుర్‌లోని చారిత్రక మెహరాన్‌ గఢ్‌ కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందన్నారు. శీష్‌ మహల్‌, జానకి మహల్‌లను నిర్మించిన తీరు సమ్మోహనంగా ఉందని పేర్కొన్నారు. వీటిని నిర్మించిన కళాకారుల ప్రతిభను అభినందించకుండా ఉండలేకపోతున్నానని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన