ఉగ్రవాదానికి అడ్డా పాక్‌

ప్రధానాంశాలు

Updated : 29/09/2021 06:01 IST

ఉగ్రవాదానికి అడ్డా పాక్‌

భారత్‌ లక్ష్యంగా ముష్కర ముఠాలకు ఆశ్రయం

అమెరికా ‘సీఎస్‌ఆర్‌’ నివేదిక

వాషింగ్టన్‌: అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు అడ్డా అని తాజాగా అమెరికా కాంగ్రెషనల్‌ రిపోర్ట్‌ కుండబద్ధలు కొట్టింది. ‘అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలు’గా అమెరికా గుర్తించిన వాటిలో కనీసం 12 పాక్‌లోనే ఉన్నాయని తేల్చింది. వీటిలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహమ్మద్‌ (జేఈఎం) వంటివి 5 వరకు ఉన్నట్లు స్పష్టం చేసింది. యూఎస్‌ కాంగ్రెస్‌కు చెందిన కాంగ్రెషనల్‌ రీసెర్చి సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) స్వతంత్ర నిపుణులు.. ‘పాకిస్థాన్‌లో ఉగ్రవాద ముఠాలు’ పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో పలు అంశాలను వెల్లడించారు. క్వాడ్‌ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆతిథ్యం ఇచ్చిన సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ‘‘ముంబయిలో 2008 ఉగ్ర దాడులతో పాటు అనేక కీలక ముష్కర ఘటనలకు పాల్పడింది ‘ఎల్‌ఈటీ’యే..’’ అని సీఆర్‌ఎస్‌ నివేదిక తేటతెల్లం చేసింది.

నివేదికలోని కీలకాంశాలివే..

* పాకిస్థాన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద ముఠాలు స్థూలంగా 5 కేటగిరీలు. ‘ప్రపంచం, అఫ్గానిస్థాన్‌, భారత్‌ అండ్‌ కశ్మీర్‌, పాక్‌ (స్వదేశం), షియాలు’ లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయి.

* 1980ల్లో పాక్‌లో ఏర్పాటైన ఎల్‌ఈటీని, 2000లో కశ్మీరీ ఉగ్రవాద నాయకుడు మసూర్‌ అజార్‌ ఏర్పాటు చేసిన జేఈఎం ముఠాను 2001లోను విదేశీ ఉగ్రవాద ముఠాలు (ఎఫ్‌టీఓలు)గా గుర్తించారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి ఘటన ఈ రెండు ముఠాల పనే. జేఈఎం అమెరికాపై బాహాటంగానే యుద్ధం ప్రకటించింది.

* సోవియట్‌ సైన్యం లక్ష్యంగా 1980లో అఫ్గాన్‌లో ఏర్పాటైన ఉగ్రవాద ముఠా హరాకత్‌-ఉల్‌ జిహాద్‌ ఇస్లామీ (హుజీ)ని 2010లో ఎఫ్‌టీఓగా గుర్తించారు. 1989 తర్వాత ఈ ముఠా భారత్‌ను లక్ష్యంగా చేసుకుంది. అఫ్గాన్‌ తాలిబన్లకు ఈ ముఠా ఆయుధాలను కూడా సరఫరా చేసింది. అదృశ్య ‘శక్తి’తో హుజీ ప్రస్తుతం పాకిస్థాన్‌, అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌లలో కార్యకలాపాలు సాగిస్తోంది. కశ్మీర్‌ను పాక్‌లో విలీనం చేయాలని ఈ ముఠా డిమాండ్‌ చేస్తోంది.

* పాకిస్థాన్‌లోని పలు నగరాలతో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పనిచేస్తున్న ‘హెచ్‌యూఎం’ను 1997లో ఎఫ్‌టీఓగా గుర్తించారు. పాక్‌లో అతిపెద్ద ఇస్లామిస్ట్‌ రాజకీయ పార్టీ విభాగంగా చెప్పుకొంటున్న హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ (హెచ్‌ఎం) 1989లో ఏర్పాటైంది. దీన్ని 2017లో ఎఫ్‌టీఓగా గుర్తించారు. జమ్మూ-కశ్మీర్‌లో అతిపెద్ద, చాలాకాలంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాల్లో ఇదొకటి.

* పాక్‌ అడ్డాలో పనిచేస్తున్న మరో కీలక ముఠా ఆల్‌ ఖైదా. కరాచీ సహా పలు ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నెరపుతున్న ఈ ముఠా అఫ్గాన్‌లోనూ పనిచేస్తోంది. 2011 నుంచి అయమన్‌ అల్‌-జవహరీ ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు. పాక్‌లో అనేక ముఠాలతో దీనికి సంబంధాలున్నాయి.

* ‘ఆల్‌ ఖైదా ఇన్‌ ద ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌, ఇస్లామిక్‌ స్టేట్‌ - ఖొరాసన్‌ ప్రావిన్స్‌, అఫ్గాన్‌ తాలిబన్‌, హక్కానీ నెట్‌వర్క్‌, తెహ్రిక్‌-ఈ-తాలిబన్‌ పాకిస్థాన్‌, బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, జుందల్లా (అకా జేష్‌ అల్‌-అదుల్‌), సిపా-ఈ-సహబా పాకిస్థాన్‌, లష్కరే ఝాంగ్వీ’ ఉగ్రవాద ముఠాలు కూడా పాకిస్థాన్‌లో ఉన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన