వాతావరణ మార్పుల నుంచి సాగుకు రక్షణ

ప్రధానాంశాలు

Published : 29/09/2021 05:31 IST

వాతావరణ మార్పుల నుంచి సాగుకు రక్షణ

పర్యావరణాన్నీ కాపాడుకునేలా చర్యలు

 ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

దిల్లీ: వాతావరణంలో వస్తున్న మార్పులు వ్యవసాయానికే కాకుండా మొత్తం పర్యావరణానికీ పెను సవాల్‌ను విసురుతున్నాయని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ సమస్యను పరిష్కరించుకునే యత్నాలను ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక పోషక విలువలున్న ఆహారాన్ని అందించే 35 రకాల నూతన వంగడాలను మంగళవారం ఆయన విడుదల చేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్‌) వీటిని అభివృద్ధిపరిచింది. ఐకార్‌ సంస్థలతో పాటు కేంద్రీయ, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన్‌ కేంద్రంలలో దూర దృశ్య విధానం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాలుగు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు హరిత ప్రాంగణ (గ్రీన్‌ క్యాంపస్‌) అవార్డులు ప్రదానం చేశారు. సాగు రంగంలో నూతన విధానాలను అనుసరించిన అయిదు రాష్ట్రాలకు చెందిన అయిదుగురు రైతులతో సంభాషించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో నిర్మించిన జాతీయ బయోటిక్‌ స్ట్రెస్‌ టాలరెన్స్‌ సంస్థ (ఎన్‌ఐబీఎస్‌టీ) నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయా కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు.

వ్యవసాయం, శాస్త్రవిజ్ఞానం జట్టు కట్టాలి

భారతీయ వ్యవసాయ రంగం, శాస్త్ర విజ్ఞానం కలిసి కట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. గత ఆరేడు సంవత్సరాలుగా సాగు రంగ సమస్యల పరిష్కారానికి ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ప్రాధాన్య అంశంగా మారిందంటూ.. డ్రోన్లు, సెన్సర్ల వినియోగం పెరిగిన తీరును వివరించారు. మొత్తం 1300 రకాల వంగడాలను అభివృద్ధిపరిచారని, ప్రస్తుతం 35 రకాల వంగడాలను రైతులకు అంకితమిస్తున్నామన్నారు. ప్రధాని విడుదల చేసిన కొత్త వంగడాల్లో వర్షాభావ పరిస్థితులను, చీడలను తట్టుకొనే కంది, సెనగ, సోయా, వరి, సజ్జ, మొక్కజొన్నతో పాటు అధిక పోషకవిలువల గోధుమ రకాలు ఉన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన