సెకన్లలోనే పండ్లు, కూరగాయల నాణ్యత ఫలితాలు

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:48 IST

సెకన్లలోనే పండ్లు, కూరగాయల నాణ్యత ఫలితాలు

‘ల్యాబ్‌ ఇన్‌ ఏ పాకెట్’ సృష్టించిన ఐఐటియన్లు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయల నాణ్యతపై ల్యాబ్‌ పరీక్షల ఫలితాల కోసం గంటల కొద్దీ, కొన్నిసార్లు రోజులపాటు వేచి చూడాల్సి వస్తోంది. ఐఐటీ మద్రాస్‌లో చదివిన అమిత్‌ శ్రీవాత్సవ, అంకిత్‌ చౌహాన్‌ దీనికి పరిష్కారం చూపుతూ ‘ల్యాబ్‌ ఇన్‌ ఏ పాకెట్’ విధానం కనుగొన్నారు. తాము రూపొందించిన పరికరానికి ఇన్ఫైజర్‌ అని పేరుపెట్టారు. తద్వారా త్వరగా ఫలితాలు రాబట్టేందుకు వీలు కలుగుతోంది. ల్యాబొరేటరీలో చేసే పనిని ‘ల్యాబ్‌ ఇన్‌ ఏ పాకెట్’ ద్వారా సెకన్ల వ్యవధిలో అదే నాణ్యతతో చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. వారిద్దరూ ‘ఇన్ఫియు’ (ఐఎన్‌ఎఫ్‌వైయు) అనే అగ్రిటెక్‌ సంస్థను ప్రారంభించారు. మనుషులను తక్కువ సంఖ్యలో ఉపయోగించడం ద్వారా పండ్లు, కూరగాయలు వృథా కాకుండా ఇంటర్నెట్ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) టెక్నాలజీతో రైతు ఉత్పత్తుల నాణ్యత పరిశీలిస్తున్నారు. మౌస్‌ లాంటి పరికరంతో నాలుగు సెకన్లలో పండ్లను స్కాన్‌ చేసి ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలతో నాణ్యతను పరిశీలించి ఫలితాలను స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్‌కు పంపేలా వ్యవస్థను రూపొందించారు. దీనిద్వారా పండ్లు, కూరగాయల రుచి, వాటిలోని పోషక విలువలు తెలుసుకోవడంతో పాటు... వాటిలో ప్రమాదకర రసాయనాలు, ఇతర పదార్థాలు ఉంటే వాటినీ గుర్తించొచ్చు. పెద్ద టోకు వ్యాపారులు పండ్ల నాణ్యత పరిశీలించడానికి టన్ను యాపిల్స్‌ నుంచి 1-1.5 కేజీల బరువున్న ఆరు నుంచి ఎనిమిది కాయలు తీసుకుని ముక్కలు చేసి పరిశీలిస్తారని, ఇది మంచి పద్ధతి కాదని వారు తెలిపారు. అంకిత్‌ చౌహాన్‌ రైతు కుటుంబం నుంచి వచ్చారు. సత్వర ఫలితాలు, పండ్ల వృథాను అడ్డుకునేందుకు అగ్రిటెక్‌ ద్వారా కృషి చేస్తున్నట్లు వారిద్దరూ తెలిపారు. మౌస్‌ లాంటి పరికరం ఐఓటీ ఆధారిత సింథటిక్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా శక్తినిచ్చే స్పెక్ట్రోస్కోపీ టెక్నాలజీతో పనిచేస్తుందన్నారు. తద్వారా రైతుల పంటకు అధిక ధర లభిస్తుందన్నారు. ఏంజిల్‌ ఇన్వెస్టర్స్‌ నుంచి వచ్చిన ఫండింగ్‌ ఆధారంగా షిమ్లా, నోయిడా, మహారాష్ట్రలోని భివాండీ ప్రాంతాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నట్లు వివరించారు. మూడేళ్లుగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ అనేక మందికి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన