ఎన్నికలకు ఈసీ సమాయత్తం

ప్రధానాంశాలు

Updated : 15/10/2021 05:36 IST

ఎన్నికలకు ఈసీ సమాయత్తం

దీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారుల బదిలీకి ఆదేశం

జనవరి చివరి వారంలో ‘ఐదు రాష్ట్రాల’ నోటిఫికేషన్‌!

ఈనాడు, దిల్లీ: వచ్చే ఏడాది మార్చి, మే నెలల నాటికల్లా గడువు ముగిసే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. దానిలో భాగంగా.. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి 23 మధ్య వేర్వేరు తేదీల్లో గోవా, మణిపుర్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలకు, మే 14వ తేదీ నాటికి ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి గడువు ముగుస్తుంది. ఆ తేదీల్లోపు ఆ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలి. జనవరి చివరి వారంలో షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికలతో నేరుగా సంబంధం ఉండే అధికారులు వారి సొంత జిల్లాల్లో కానీ, మరే జిల్లాలోనైనా మూడేళ్లుగా పనిచేస్తుంటే వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. ఏదైనా కోర్టులో కేసు విచారణలో ఉన్న అధికారులను ఎన్నికల సంబంధిత విధుల్లోకి తీసుకోవద్దని తెలిపింది.

షెడ్యూల్‌ విడుదలయ్యేలోపు పార్లమెంటు సమావేశాలు

మరోవైపు- ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలోపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నవంబరు మూడో వారం తర్వాతి నుంచి డిసెంబరు నాలుగో వారం లోపు సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో దీనిపై పార్లమెంటు వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన