హద్దుమీరితే మెరుపుదాడులే!

ప్రధానాంశాలు

Updated : 15/10/2021 10:20 IST

హద్దుమీరితే మెరుపుదాడులే!

ఉగ్రమూకలకు, పాకిస్థాన్‌కు అమిత్‌ షా హెచ్చరిక

గోవాలో జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ వర్సిటీకి శంకుస్థాపన

పణజి: దేశ సరిహద్దులను దాటివచ్చి హింసకుపాల్పడితే మెరుపు దాడుల(సర్జికల్‌ స్ట్రైక్స్‌)తో గట్టిగా బదులిస్తామని ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. అయిదేళ్ల క్రితం(2016 సెప్టెంబరు 29న) భారత సైనికులు నియంత్రణ రేఖకు ఆవల చేపట్టిన మెరుపుదాడులను గుర్తు చేశారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించబోదని స్పష్టం చేశారు. ముష్కరమూకలకు అర్థమయ్యే భాషలోనే సమాధానమిస్తామని తెలిపారు. దక్షిణ గోవాలోని ధర్బందర గ్రామంలో గురువారం జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం అమిత్‌ షా ప్రసంగించారు.

ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌

ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగంలో నెలకొన్న నిపుణుల కొరత.. నిందితుల నేర నిరూపణపై ప్రభావం చూపుతోందని, దీనివల్ల శిక్షలు పడే కేసుల సంఖ్య తక్కువగా ఉంటోందని అమిత్‌ షా తెలిపారు. అపరిష్కృత కేసులూ పెరిగిపోతున్నాయన్నారు. ఆరేళ్లకు పైగా జైలు శిక్షలు పడే తీవ్రత ఉన్న కేసుల్లో నేర ఘటనల స్థలాలను ఫోరెన్సిక్‌ బృందాలు సందర్శించడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. ‘నేరానికి పాల్పడితే జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందనే భయాన్ని కరడుగట్టిన నేరగాళ్లలో సృష్టించాలి. ఇది జరగాలంటే ఫోరెన్సిక్‌ నిపుణుల కొరతను అధిగమించాలి. ప్రతిజిల్లాలోనూ చిన్నపాటి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లతో పాటు నిపుణుల బృందాలు ఉండాలి’ అని అమిత్‌షా వివరించారు.

పాస్‌పోర్టు విలువను పెంచిన మోదీ

మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత మన దేశ పాస్‌పోర్టు విలువ పెరిగిందని అమిత్‌ షా తెలిపారు. ‘మన దేశంపై యావత్‌ ప్రపంచం దృష్టే మారిపోయింది. విదేశాలకు వెళ్లే మన నావికులు మన దేశ పాస్‌పోర్టును చూపించినప్పుడు అక్కడి అధికారుల ముఖాల్లో చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. మోదీ దేశం నుంచి వస్తున్నారా’ అని అంటారని పేర్కొన్నారు. తలైగావో అసెంబ్లీ నియోజక వర్గ భాజపా కార్యకర్తల సమావేశంలో అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన