చదువులను చిదిమేస్తున్న ‘ఆందోళన’

ప్రధానాంశాలు

Updated : 19/10/2021 05:31 IST

చదువులను చిదిమేస్తున్న ‘ఆందోళన’

నిపుణులు ఏమంటున్నారు

బ్రిస్బేన్‌: కరోనా కారణంగా బడులు నెలల తరబడి మూతపడ్డాయి. ఆన్‌లైన్‌ చదువులే దిక్కయ్యాయి. మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడు పాఠశాలలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్నాయి. అయితే, చాలామంది చిన్నారుల మానసిక స్థితి మునుపటిలా లేదని నిపుణులు అంటున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారడం... లేనిపోని భయాలు, అపోహలు చుట్టుముట్టడంతో వారు తీవ్ర ఆందోళన, వ్యాకులత చెందుతున్నట్టు చెప్పారు. ప్రతి ఏడుగురు బాలల్లో ఒకరు ఇలాంటి బాధితులే ఉంటున్నారని, చదువుల్లో వారు ప్రతిభ కనబరచలేకపోతున్నారని వివరించారు. 


ఇవీ లక్షణాలు 

మనసులో అలజడి. కొన్ని విషయాల్లో తీవ్రంగా భయపడటం. తల బరువెక్కడం. చూపు మసకబారడం. గుండె వేగంగా కొట్టుకోవడం. కడుపులో మంట. పరీక్షలు, వక్తృత్వం వంటి ప్రతిభను ప్రదర్శించాల్సిన సందర్భాల్లో విద్యార్థుల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆందోళన భరించలేని స్థాయిలో, రోజువారీ పనులకు ఆటంకంగా ఉంటే... వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. 


తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేయాల్సింది... 

నేర్చుకునే క్రమంలో తప్పులు, వెనుకబడటం సహజమని, వీటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సూచించాలి. వారి ప్రయత్నాలను అభినందించాలి. గతంలో వారు సాధించిన విజయాలను గుర్తుచేస్తూ, ఆత్మవిశ్వాసం నింపాలి. చిన్నారులతో కలివిడిగా ఉంటూ, వారు చెప్పే విషయాలను శ్రద్ధగా, ఆసక్తితో, సానుభూతితో వినాలి. వారి వయసుకు తగిన భాషను ఉపయోగిస్తూ, భయాలను దూరం చేయాలి. అనవసర విషయాల గురించి ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదని వారికి వివరించాలి. వారిని తొందరపెట్టకూడదు. బెదిరించకూడదు. మొదట చిన్న పనులను అప్పగించి, క్రమంగా పెద్ద టాస్కులు ఇవ్వాలి. చదువు, వ్యక్తిగత పనుల్లో సులభంగా ముందుకు వెళ్లేలా చిట్కాలను సూచించాలి. ఏదైనా సమస్య ఆందోళన కలిగిస్తే, దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దని, సాయంత్రం మాట్లాడుకుందామని అభయమివ్వాలి. ముందు హోంవర్క్‌ చేసి, ఇష్టమైనవి తిని, ఆడుకోవాలని వారికి సూచించాలి.


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన