జపాన్‌ రాకుమారి అ‘సామాన్యురాలు’

ప్రధానాంశాలు

Updated : 27/10/2021 13:08 IST

జపాన్‌ రాకుమారి అ‘సామాన్యురాలు’

రాచరికం వదులుకుని..  సామాన్యుడిని మనువాడిన మకో
ఫలించిన మూడేళ్ల నిరీక్షణ

టోక్యో: రాకుమారి పెళ్లంటే మాటలా! వైభవం ఉట్టిపడేలా వజ్ర వైఢూర్యాలతో అలంకరణలు.. రాజ భవంతిలో అంబరాన్నంటే సంబరాలు.. ధగధగలు.. విందు వినోదాలు.. కలకాలం గుర్తుండిపోయేలా ఉంటాయి. ఆమెను మనువాడే వరుడు ఇంకెంత గొప్పవాడోనన్న ఆత్రుత అందరిలోనూ కనిపిస్తుంది. కానీ, జపాన్‌ రాకుమారి మకో (30) ఇవేవీ కోరుకోలేదు! తాను ప్రేమించిన సామాన్యుడి కోసం మూడేళ్లు నిరీక్షించి, చివరికి అతడినే పెళ్లాడింది. రాచరికాన్ని, రాజభరణాన్ని తృణప్రాయంగా వదులుకుంది. అతని ఇంటిపేరునే తన ఇంటిపేరు చేసుకొంది.

మకో- కీ కొమురోల వివాహం టోక్యో ఇంపీరియల్‌ ప్యాలెస్‌లో మంగళవారం అత్యంత నిరాడంబరంగా జరిగింది. రాజప్రసాదాన్ని వీడి వెళ్లేముందు... మకో తన తల్లిదండ్రులను, సోదరిని హత్తుకుని భావోద్వేగానికి గురైంది.

జపాన్‌ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కుమార్తె అయిన మకో... టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీలో చదువుకుంది. ఆ సమయంలో తోటి విద్యార్థి అయిన కొమురోను ఇష్టపడింది. 2017లోనే ఈ జంట తాము ప్రేమ వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించింది. అయితే కొమురో తల్లి కారణంగా తలెత్తిన ఆర్థిక వివాదాలతో వారి వివాహం ముందడుగు పడలేదు. దీంతో న్యాయవిద్యను అభ్యసించేందుకు కొమురో 2018లో న్యూయార్క్‌ వెళ్లిపోయాడు. అప్పట్నుంచి జపాన్‌ వైపు తిరిగి చూడని ఆయన.. చదువు పూర్తిచేసుకుని గత నెలలో స్వదేశానికి తిరిగొచ్చాడు. ఈ జంట మళ్లీ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఆర్థిక వివాదంపై స్పష్టత ఇవ్వాలని మకో తండ్రి కొమురోను అడిగారు. ఇందుకాయన లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలిపారు.


నాకున్నది ఒకే ఒక్క జీవితం. మకోను నేను ప్రేమిస్తున్నాను. ఆమెతోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను. తుదిశ్వాస వరకూ ఆమెకు తోడుంటాను

- కొమురో


నా దృష్టిలో కొమురో అమూల్యమైన వ్యక్తి. మా హృదయాలు కలిశాయి. అందుకే మేమిద్దరం వివాహ బంధంతో ఒక్కటవుతున్నాం

- మకో


ప్రజల నుంచి వ్యతిరేకత...

వివాహానికి మెజార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో రాజ కుటుంబం పెద్దగా హడావుడి చేయలేదు. సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించలేదు. మకో-కొమురోలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్టు అధికారిక పత్రాలు మాత్రం విడుదల చేసింది. జపాన్‌ రాజకుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్ధపడ్డ మకో... రాజభరణం కింద తనకు వచ్చే సుమారు రూ.10 కోట్ల (140 మిలియన్‌ యెన్‌లు) మొత్తాన్ని కూడా వదులుకొంది. వివాహం సందర్భంగా నవ దంపతులిద్దరూ మీడియా ముందుకు వచ్చారు. అయితే, అసౌకర్యం కారణంగా వారు నేరుగా మాట్లాడలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు వారు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. కాగా- వీరి వివాహాన్ని వ్యతిరేకిస్తూ టోక్యోలో పలువురు ప్రజలు మంగళవారం ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన