కొవిషీల్డ్‌పై ఆందోళనలు అనవసరం

ప్రధానాంశాలు

Published : 25/03/2021 05:01 IST

కొవిషీల్డ్‌పై ఆందోళనలు అనవసరం

మన వ్యాక్సిన్ల సమర్థత మీద సందేహాలు వద్దు: కేంద్రం

దిల్లీ: కరోనా నివారణ వ్యాక్సిన్లలో ఒకటైన కొవిషీల్డ్‌ సురక్షితమైనదేనని, ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం స్పష్టంచేసింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ వల్ల దుష్ప్రభావాలు పడతాయనే ఉద్దేశంతో కొన్ని ఐరోపా దేశాలు దీని వినియోగాన్ని నిలిపివేశాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికార వర్గాలు ఈ భరోసాను ఇచ్చాయి. ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నవారికి రక్తం గడ్డకట్టుకుపోతున్నట్లు కొన్ని దేశాల్లో అనుమానిస్తున్నా అలాంటి ముప్పు ఏమీ ఉండదని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వి.కె.పాల్‌ బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో వాడుతున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు యూకే, బ్రెజిల్‌ రకాల వైరస్‌ పైనా సమర్థంగా పనిచేస్తాయని, అది శాస్త్రీయ అధ్యయనాల్లో రుజువైందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ చెప్పారు. దక్షిణాఫ్రికా రకం వైరస్‌పై మన వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తున్నాయనే పరిశోధన ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. వీటి సమర్థతపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ప్రజల్ని కోరారు. పాత, కొత్త రకాల వైరస్‌లు రెండింటిపైనా మన వ్యాక్సిన్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయని చెప్పారు. కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. రెండో విడత విజృంభణను అడ్డుకునేందుకు టీకాను ఒక సాధనంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన