వచ్చే నాలుగు వారాలు చాలా సంక్లిష్టం : కేంద్రం

ప్రధానాంశాలు

Updated : 07/04/2021 09:44 IST

వచ్చే నాలుగు వారాలు చాలా సంక్లిష్టం : కేంద్రం

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 విస్తరణ వేగం గతేడాది కంటే బాగా పెరిగిందని, వ్యాధి తీవ్రత కూడా ఉద్ధృతమైందని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ పేర్కొన్నారు. రెండో దశకు సంబంధించి వచ్చే నాలుగు వారాలు అత్యంత క్లిష్టమైనవని చెప్పారు. కరోనా వ్యాప్తికి  అడ్డుకట్ట వేసేందుకు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని స్పష్టంచేశారు. మంగళవారమిక్కడ ఆయన దేశంలో కరోనా పరిస్థితిపై విలేకరులతో మాట్లాడారు. ‘‘రెండో దశ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం. వచ్చే నాలుగు వారాలు అత్యంత క్లిష్టమైనవి. మహమ్మారిపై పోరాడేందుకు దేశమంతా ఒక్కటై చర్యలు చేపట్టాలి’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాధిపై పోరుకు ఉపయోగపడే అంశాలు (పరికరాలు) గతంలో ఉన్నవేనని స్పష్టంచేశారు. కొవిడ్‌-19 పట్ల అవగాహనతో వ్యవహరించడం, కట్టడి మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించడం, ఆరోగ్య సదుపాయాలను పెంచడం, టీకాల కార్యక్రమం వేగం పెంచడం వంటివాటితో అడ్డుకోవచ్చని తెలిపారు. ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలని, రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలని సూచించారు. కాగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున 18 ఏళ్లు దాటిన పౌరులు అందరూ టీకాలు పొందేందుకు అనుమతించాలని భారతీయ వైద్య సంఘం ప్రధానికి లేఖ రాసింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన