close

తాజావార్తలు

బంగ్లాదేశ్ అసలెక్కడుంది?: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఏం మాట్లాడినా వార్త అవుతుంది. ఇరాక్‌లోని యాజీదీలు, మయన్మార్‌లోని రోహింగ్యా శరణార్థుల సంబంధించిన అంశాలపై వారి తరఫు ప్రతినిధులు మాట్లాడుతుండగా వాటిపై అవగాహన లేనట్లుగా కనిపించారు. ఆ సందర్భంగా బంగ్లాదేశ్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. ఇరాక్, మయన్మార్ దేశాల్లో మైనార్టీ వర్గాలపై జరిగిన మతపరమైన హింస నుంచి బతికి బయటపడ్డ కొంతమందితో ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో సమావేశమైన సందర్భంగా ఈ పరిస్థితి ఎదురైంది. 

రోహింగ్యాల రక్షణ కోసం యూఎస్‌ తీసుకుంటున్న చర్యలపై ఓ సభ్యుడు మాట్లాడుతూ..‘నేను బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరంలో ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాను. చాలా మంది శరణార్థులు సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నారు. మాకు సహాయం చేయడంలో మీ ప్రణాళిక ఏంటి?’ అని ట్రంప్‌ను ప్రశ్నించారు. దానికి వెంటనే ట్రంప్‌ ‘ఇంతకీ అదెక్కడ ఉంది?’ అని ప్రశ్నించగా, ‘బర్మా(మయన్మార్) పక్కనే బంగ్లాదేశ్‌ ఉంది’ ఆయన సలహాదారు వెల్లడించారు.  

అంతేకాకుండా ఈ సమావేశంలో నోబెల్ గ్రహీత నదియా మురాద్ ఇరాక్‌లోని ఓ మతవర్గమైన యాజీదీల గురించి ప్రస్తావించారు. ఐసిస్‌ అపహరించిన అనేక మంది మహిళలు, యువతుల్లో నదియా మురాద్ ఒకరు. ఆమె వారి బానిసత్వం నుంచి బయటపడి, ఐసిస్‌ అరాచకాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘నా తల్లి, ఆరుగురు సోదరులను ఐసిస్‌ ఉగ్రమూకలు హత్య చేశాయి. అపహరణకు గురైన 3,000 మంది యాజీదీలు జాడ ఇప్పటికీ కనిపించట్లేదు’ అని వాపోయారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ..‘మీరు నోబెల్ బహుమతి గ్రహీత కదా? చాలా గొప్ప విషయం. మీకు నోబెల్ దేనికి ఇచ్చారు?’ అని ప్రశ్నించారు.

దాంతో కొద్దిసేపు నిశబ్దంగా ఉన్న మురాద్, నోబెల్ గెలుచుకోవడానికి గల కారణాన్ని వివరించారు. అలాగే ‘ఇది  నా ఒక్క కుటుంబ సమస్య కాదు. మీరు ఏదైనా చేయాలి’ అని ఆమె ట్రంప్‌ను అభ్యర్థించారు. ఐసిస్‌ను అణచివేసిన విధానాన్ని ఆయన ఈ సందర్భంగా గొప్పగా ప్రస్తావించారు. శరణార్థులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడటానికి వచ్చిన ప్రతినిధులు మూడు రోజుల పాటు స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. 
 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.