IND vs PAK: ఈసారి మాయ జరగలేదు

ప్రధానాంశాలు

Updated : 25/10/2021 07:02 IST

IND vs PAK: ఈసారి మాయ జరగలేదు

ఈనాడు క్రీడావిభాగం

1996 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో క్వార్టర్‌ఫైనల్లో ఛేదనలో ఒక దశలో 84/0తో నిలిచింది పాక్‌.. అయినా ఆ జట్టు గెలవలేదు.. 2011 ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ ఛేజింగ్‌లో పాక్‌ (44/0)కు శుభారంభమే దక్కింది అయినా నెగ్గలేదు.. 2015 కప్‌లోనూ ఛేదనలో ఆ జట్టు 79/1తో నిలిచింది.. అయినా భారత్‌దే విజయం.. కానీ ఈసారి మాత్రం సీన్‌ రివర్స్‌! ఎంత ఎదురు చూసినా వికెట్లు పడలేదు.. మనోళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అసలు ఆడుతోంది పాక్‌తోనేనా.. ప్రపంచకప్‌లోనేనా అన్న అనుమానం కలిగేంతగా.. ఫలితం భారత అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే ఉండే తీవ్రమైన ఒత్తిడే కనబడలేదు. అంతా వన్‌సైడ్‌.. మామూలుగా చిరకాల ప్రత్యర్థితో పోరంటే ఎన్ని మలుపులు తిరిగినా చివరికి విజయం మాత్రం మనల్నే వరించేది. ఉద్విగ్న భరిత క్షణాలు ఉన్నా ఆఖరికి భారత అభిమానుల పెదవులపైనే చిరునవ్వు పూసేది. కానీ ఈసారి మాత్రం మన రోజు కాదు. టాస్‌ దగ్గర నుంచి ఏదీ కోహ్లి సేనకు కలిసి రాలేదు. పాక్‌తో మ్యాచ్‌ అంటే మన వెంట ఉండే ఆ అదృష్టం ఈసారి మనల్ని వరించలేదు. ఎప్పుడూ పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టి ఫలితాన్ని సాధించే భారత్‌.. ఈసారి తానే ఒత్తిడిలో పడిపోయి ఓటమిని మూటగట్టుకుంది.

ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌ రికార్డుకు ఏదో ఒక దశలో బ్రేక్‌ పడే అవకాశాలు లేకపోలేదని అందరికీ తెలుసు. కానీ మరీ ఇంత ఏకపక్షంగా ఓడటాన్నే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్‌ పక్కా ప్రణాళికతో ఈ మ్యాచ్‌లో అడుగు పెట్టిందని.. రోహిత్‌ శర్మ బలహీనతకు తగ్గట్లే వేగవంతమైన బంతితో షహీన్‌ అతణ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నపుడే అర్థమైపోయింది. బంతుల్లో ఎంత వేగం ఉంటే అంత బాగా షాట్లు ఆడే కోహ్లి, హార్దిక్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌కు రవూఫ్‌ స్లో బంతుల్లో చెక్‌ పెట్టిన వైనం కూడా పాక్‌ ప్రణాళికకు నిదర్శనం. ఇక ఫామ్‌లో లేని భువనేశ్వర్‌తో బౌలింగ్‌ దాడిని ఆరంభించడం భారత్‌ చేసిన వ్యూహాత్మక తప్పిదం. తొలి ఓవర్లోనే రెండు పెద్ద షాట్లు పడటంతో పాక్‌ ఓపెనర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. వాళ్లు ఒత్తిడిలో పడలేదు. భారత్‌ కాస్త ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా.. కీలక సమయంలో మళ్లీ బౌండరీలు రావడంతో పాక్‌కు తిరుగులేకపోయింది. మ్యాచ్‌లో ఏదో ఓ దశలో జట్టు పుంజుకుంటుందని.. ప్రత్యర్థిని వెనక్కి నెడుతుందని.. విజయాన్ని అందుకుంటుందని చివరి వరకూ ఎదురు చూడని అభిమాని లేడు. కానీ మ్యాచ్‌ సాగుతున్నా కొద్దీ ఎలాంటి ప్రతిఘటన చూపని భారత ఆటగాళ్లు ఇలా చిత్తవడం మింగుడు పడనినిదే. ఇది కేవలం ఓ ఓటమి మాత్రమే కాదు. ప్రపంచకప్‌ల్లో పాక్‌పై భారత ఆధిపత్యానికి పడిన గండి. ఇప్పటివరకూ 12 సార్లు భారత్‌ చేతిలో ఓడిన పాక్‌.. తొలిసారి పరాజయ బాధను కేవలం టీమ్‌ఇండియాకే కాదు మొత్తం దేశానికే పరిచయం చేసిన ఓ పీడకల ఇది. దాయాదిపై గొప్పగా చెప్పుకునేందుకు ఇన్నాళ్లుగా ఉన్న రికార్డు ఇప్పుడు కనుమరుగైందనే ఆవేదన ఇది.  ఈ ఓటమి ఎంతో వేదన కలిగించేదే కానీ.. ఈ ఒక్క మ్యాచ్‌తోనే అంతా అయిపోదు. ఈ టోర్నీలో భారత్‌ ప్రయాణం ఇంకా చాలా ఉంది. ఓ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తర్వాత మ్యాచ్‌లో గాడిన పడితే.. సెమీస్‌ చేరడం తేలికే. అక్కడ గెలిచి, మరోవైపు పాక్‌ కూడా ముందంజ వేసి, 2007 ప్రపంచకప్‌ ఫైనల్లో మాదిరే మళ్లీ చిరకాల ప్రత్యర్థులు తలపడతాయని, అప్పుడు ఈ ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుని భారత్‌ రెండోసారి పొట్టి కప్పు అందుకుంటుందని ఆశిద్దాం!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన