close

కథనాలు

Updated : 23/04/2021 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్యాచ్‌లను ఇలా కూడా పడతారా..!

 క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డర్ల పాత్ర ఎనలేనిది. మెరుపు వేగంతో బౌండరీవైపునకు దూసుకెళ్లే బంతులను అంతే వేగంతో అడ్డుకోవాలి. గాల్లోకి లేచిన బంతికి ఒడిసిపట్టాలి. మ్యాచ్‌లో పైచేయి సాధించాలంటే ప్రతి క్యాచ్‌ను పట్టుకోవాల్సిందే. ముఖ్యంగా బౌండరీ లైన్‌ దగ్గర ఎగిరి క్యాచ్లు‌ పట్టడం చాలా కష్టం. ఐపీఎల్‌లో కొంతమంది ఆటగాళ్లు చిరుతలాగా ఎగిరి అద్భుతమైన క్యాచ్ల‌ను అందుకుని ఔరా! అనిపించారు. వీటిలో టాప్‌-5 క్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం. 

ఒంటి చేత్తో డివిలియర్స్‌ మాయ

ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న మంచి ఫీల్డర్లలో ఏబీ డివిలియర్స్‌ ఒకడు. 2018లో బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ జట్టు 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో మొయిన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో చివరి బంతిని హేల్స్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా బలంగా బాదాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఏబీ డివిలియర్స్‌ ‘స్పైడర్ మ్యాన్‌’లాగా ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకుని ‘సూపర్‌ మ్యాన్’ అనిపించుకున్నాడు.

కోహ్లీని ఆశ్యర్యపరిచిన ట్రెంట్ బౌల్ట్‌ 

2018లో చిన్నస్వామి స్టేడియం వేదికగా దిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్‌ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ జట్టు 175 పరుగులు చేసింది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో 11 ఓవర్‌ వేసిన హర్షల్‌ పటేల్‌ చివరి బంతిని పుల్‌టాస్‌గా వేశాడు. దీన్ని కోహ్లీ బలంగా బాదాడు. అది మిడ్ వికెట్‌ మీదుగా బౌండరీ లైన్‌ వైపు రాకెట్ స్పీడ్‌తో దూసుకొచ్చింది. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ట్రెంట్‌ బౌల్ట్‌ బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి ఎగిరి ఎడమ చేత్తో అందుకుని కిందపడ్డాడు. కొన్ని ఇంచుల దూరంలోనే ఉన్న బౌండరీ లైన్‌కు శరీరాన్ని తాకకుండా నియంత్రించుకున్న తీరు అద్భుతం. ఈ క్యాచ్ని‌ చూసిన కోహ్లీ కొద్ది సేపు ఆశ్చర్యపోయాడు.

పొలార్డ్ పవర్‌ 

కీరన్‌ పొలార్డ్‌ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచులను పట్టి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. 2019లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్‌ పట్టిన క్యాచ్‌లలో అత్యుత్తమమైనది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి..170 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన చెన్నై 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. జేసన్ బెహ్రెండార్ఫ్ వేసిన ఐదో ఓవర్‌లో అప్పటికే రెండు ఫోర్లు బాది ఊపుమీదున్న సురేశ్‌ రైనా.. ఈ ఓవర్‌లో చివరి బంతిని డీప్‌ పాయింట్ మీదుగా ఆడాడు. బౌండరీ లైన్‌కు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న పొలార్డ్‌..అక్కడి నుంచి కదలకుండానే గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఈ క్రమంలో కిందపడి కొంత దూరం వెనక్కి వెళ్లిన పొలార్డ్.. బౌండరీ లైన్‌కు తాకకుండా నియంత్రించుకున్నాడు. ఈ క్యాచ్ ‘బెస్ట్ క్యాచ్‌‌ ఆఫ్ ద సీజన్‌‌’ అవార్డును సాధించింది.

బౌండరీ దాటి పట్టిన డేవిడ్‌ హస్సీ

2010లో ఫిరోజ్‌ షా కోట్ల (ప్రస్తుతం అరుణ్ జైట్లీ) స్టేడియం వేదికగా దిల్లీ, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో డేవిడ్‌ హస్సీ అద్భుతమైన రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. కోల్‌కతా బౌలర్‌ చార్ల్‌ లాంగ్‌వెల్డ్‌ వేసిన బంతిని.. దిల్లీ బ్యాట్స్‌మన్ కాలింగ్‌వుడ్‌ లాంగ్‌ ఆన్‌ మీదుగా భారీ షాట్‌గా మలిచాడు. లాంగ్‌ ఆన్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్‌ హస్సీ సిక్స్ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకునే ప్రయత్నం చేశాడు. బంతి హస్సీ చేతికి తగిలి కొంచెం దూరంలో గాల్లోకి ఎగిరింది. వెంటనే దాన్ని అందుకున్న డేవిడ్‌ హస్సీ.. శరీర బరువును నియంత్రించుకునే క్రమంలో బౌండరీ లైన్‌ దాటాడు. కానీ అంతకన్నా ముందే బంతిని మైదానంలో గాల్లోకి విసిరి మళ్లీ వచ్చి అందుకున్నాడు. ఈ క్యాచ్‌ కూడా ‘బెస్ట్ క్యాచ్‌ ఆఫ్ ద సీజన్‌’ అవార్డును గెలుచుకుంది. 

క్రిస్‌ లిన్‌ విన్యాసం

2014లో షార్జా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. చివరి మూడు బంతుల్లో 6 పరుగులు చేస్తే బెంగళూరు గెలిచినట్లే. వినయ్‌కుమార్‌ వేసిన నాలుగో బంతిని బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ బలంగా బాదాడు. గాల్లోకి లేచిన బంతి బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న క్రిస్‌ లిన్‌ వైపు వచ్చింది. సిక్సర్‌ వెళ్లే బంతిని అనూహ్య రీతిలో అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు లిన్‌. ఈ క్యాచ్‌తో మ్యాచ్‌ మలుపు తిరిగి.. కేవలం రెండు పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.

-ఇంటర్నెట్‌ డెస్క్


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన