close

కథనాలు

Updated : 23/04/2021 17:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాక్సీ.. ఆర్సీబీ దాహం తీరుస్తాడా?  

ఈ ఏడాది కోహ్లీసేన ఎలా ఉందంటే..

ఐపీఎల్‌లో ఏటా ఫేవరెట్‌ జట్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒకటి. ఇప్పటివరకూ ఒక్కసారి టైటిల్‌ సాధించకపోయినా ఆ జట్టుకుండే క్రేజ్‌ తక్కువేమీ కాదు. ఎందుకంటే దానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఐపీఎల్‌లో నంబర్‌వన్‌ పరుగుల యంత్రం. దానికితోడు మిస్టర్‌ 360 అనే ఏబీ డివిలియర్స్‌ లాంటి కీలక ఆటగాడు ఉండటం.. వీరిద్దరూ ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాలను మార్చగల దిగ్గజాలు కావడం ఈ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే, వీరిపైనే ఆ జట్టు అధికంగా ఆధారపడుతుండడంతో ఏటా విఫలమౌతోంది. ఈసారి వేలంలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ లాంటి కీలక ఆల్‌రౌండర్‌ను తీసుకోవడంతో ఇప్పుడు అందరి ఆసక్తి అతడిపైనే నెలకొంది. మరి మాక్సీ.. ఆర్సీబీ లెక్కలు మారుస్తాడా.. దాని దాహం తీరుస్తాడా లేదా చూడాలి.


భారీ ప్రక్షాళన

ఐపీఎల్‌ ఆరంభం నుంచి టైటిల్‌ సాధించడానికి ఆర్సీబీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు. ఎప్పుడూ బ్యాటింగ్‌లో బలంగా ఉండే ఆ జట్టు ఏదో ఒక విభాగంలో విఫలమౌతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్ని రకాలుగా, ఎంత మంది ఆటగాళ్లను మార్చి చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. టాప్‌ఆర్డర్‌లో కోహ్లీ, డివిలియర్స్‌ తప్ప ఎంతమంది బ్యాట్స్‌మెన్‌ను పరిశీలించినా సరైన కూర్పు కుదరడం లేదు. అలాగే మిడిల్‌ ఆర్డర్‌లోనూ ఆ జట్టు తీసుకున్న ఆల్‌రౌండర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఇక బౌలింగ్‌ విభాగంలో ఒకరిద్దరు పేరు మోసిన బౌలర్లు తప్పా ఎప్పుడూ నిలకడైన ఆటగాళ్లు లేరు. ఈ క్రమంలోనే 14వ సీజన్‌కు ముందు ఆర్సీబీ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. గతేడాది జట్టులో నుంచి ఏకంగా 10 మందిని తొలగించి కొత్త ఆటగాళ్లను తీసుకుంది. అలాగే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను తుది జట్టులోకి తీసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.


మాక్సీ పరిస్థితి ఏంటి?

గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో మాక్సీ పంజాబ్‌ తరఫున ఆడి పూర్తిగా విఫలమయ్యాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకున్న కింగ్స్‌ జట్టు ఇలాంటి ప్రదర్శన చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడినా కనీసం ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేకపోయాడు. 15.42 సగటుతో మొత్తం 106 పరుగులే చేశాడు. అయితే తర్వాత స్వదేశంలో టీమ్‌ఇండియాతో తలపడిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం మాక్స్‌వెల్‌ రెచ్చిపోయాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి పంజాబ్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే రాబోయే సీజన్‌లో రాణిస్తాడని ఆశించిన ఆర్సీబీ అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.14.25 కోట్లకు తీసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకవేళ నిజంగానే మాక్స్‌వెల్‌ ఇక్కడ రెచ్చిపోతే కోహ్లీసేన కప్పు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.


బ్యాటింగ్‌ బలంగానే..

ఇక ఆర్సీబీ ఎప్పుడూ చూసినా పవర్‌ప్యాక్ బ్యాటింగ్ లైనప్‌ కలిగి ఉంటుందనేది తెలిసిన విషయమే. ఈసారి కూడా అందుకు విరుద్ధమేమీ కాదు. ఇప్పటికే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా దిగుతానని సంకేతాలిచ్చాడు. దాంతో అతడు యువ ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌తో కలిసి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. కాగా, గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన పడిక్కల్‌ మంచి ప్రదర్శన చేశాడు. అలాగే ఇటీవల దేశవాళీ క్రికెట్‌లోనూ అదరగొట్టాడు. అయితే, ఆర్సీబీ ఈసారి కొత్తగా మరో ఇద్దరు యువ బ్యాట్స్‌మెన్‌ను కొనుగోలు చేయడం విశేషం. వారే స్వదేశీ ఆటగాడు మహ్మద్‌ అజహరుద్దీన్‌, న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ ఫిన్‌ అలెన్‌. వీరిద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఇక తర్వాత వచ్చే డివిలియర్స్‌, మాక్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారిద్దరూ దంచి కొడితే ప్రత్యర్థులకు చుక్కలే కనిపిస్తాయి. ఆపై సచిన్ బేబి, డానియల్‌ క్రిస్టియన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు.


బౌలింగే సందేహంగా..

బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్న కోహ్లీసేన బౌలింగ్‌ విభాగమే కాస్త ఆందోళనకరంగా ఉంది. మహ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైని, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, డానియల్‌ సామ్స్‌ లాంటి పేసర్లున్నా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పెద్దగా రాణిస్తారనే నమ్మకం లేదు. భారత పేసర్లుగా కొనసాగుతున్న సైని, సిరాజ్‌ వికెట్లు తీసే సత్తా ఉన్నా అధిక పరుగులు ఇస్తారన్న అభిప్రాయం బలంగా ఉంది. మరోవైపు జేమీసన్‌ ఇటీవల పొట్టి క్రికెట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దానికితోడు అతడికి భారత్‌లో ఆడిన అనుభవం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురు ఎలా బౌలింగ్‌ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక మిగతా బౌలర్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అయితే, స్పిన్‌ బౌలింగ్‌లో ప్రభావం చూపగల యుజువేంద్ర చాహల్‌, మాక్స్‌వెల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఆడం జంపాలాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరు పేస్‌ బౌలర్ల కన్నా ఒకింత ఫర్వాలేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈసారి ఆర్సీబీ చెన్నై, అహ్మదాబాద్‌లాంటి స్లో వికెట్లపై ఆడుతుండడంతో స్పిన్నర్లు కీలకంగా మారే అవకాశం ఉంది.

ఆర్సీబీ జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, యుజువేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, పవన్‌ దేశ్‌పాండే, ఫిన్‌ అలెన్‌, షాబాజ్‌ అహ్మద్‌, నవ్‌దీప్‌ సైని, ఆడం జంపా, కైల్ జేమీసన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్, రాజత్‌ పాటిదార్‌, సచిన్‌ బేబి, మహ్మద్‌ అజహరుద్దీన్‌, డానియల్‌ క్రిస్టియన్‌, కేఎస్ భరత్‌, సుయాష్‌ ప్రభుదేశాయ్‌, డానియల్‌ సామ్స్‌, హర్షల్‌ పటేల్‌

-ఇంటర్నెట్‌డెస్క్‌


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన