close

కథనాలు

Published : 05/04/2021 07:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అవకాశం అందుకుంటారా..?

ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు మంచి ఛాన్స్‌

ఈనాడు క్రీడావిభాగం..

ఐపీఎల్‌ సీజన్‌ వస్తుందంటే చాలు.. ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న కుర్రాళ్లలో సత్తాచాటేదెవరనే ఊహాగానాలు మొదలవుతాయి. తొలిసారి లీగ్‌లో ఆడబోతున్న యువ క్రికెటర్లు ఏ మేరకు రాణించగలరనే సందేహాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి లీగ్‌లో మెరిసి.. టీమ్‌ఇండియా దిశగా సాగాలనే ఆశలు ఓ వైపు! అంచనాలను అందుకోవాలనే ఒత్తిడి మరోవైపు! మరి ఈ సారి ఆ ఒత్తిడిని చిత్తుచేసి మంచి ప్రదర్శనతో వెలుగులోకి రావాలని ఆరాటపడుతున్న ఆ కుర్రాళ్లు ఎవరు? వాళ్ల నేపథ్యం ఏమిటీ చూసేద్దాం పదండి.

సిక్సర్ల ఖాన్‌..

ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల ఆల్‌రౌండర్‌ షారుక్‌ ఖాన్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. అతని కోసం చివరకు పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా రూ.5.25 కోట్లు చెల్లించడం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో అతనేమీ ముందు వరుసలో లేడు. వికెట్ల వీరుల్లోనూ అతని పేరు లేదు. మరి అతని కోసం ఫ్రాంఛైజీలు ఎందుకు పోటీపడ్డాయంటే.. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లలో అలవోకగా సిక్సర్లు బాదగల నైపుణ్యం అతని సొంతం. దానికి తోడు ఉపయుక్తమైన ఆఫ్‌స్పిన్నర్‌ కూడా. ముస్తాక్‌ అలీ టోర్నీలో తన జట్టు విజయంలో అతనిది కీలక పాత్ర. క్వార్టర్స్‌లో కేవలం 19 బంతుల్లోనే 40 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఫైనల్లోనూ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌కు తోడు రెండో మూడో ఓవర్లు వేసి ప్రత్యర్థిని కట్టడి చేయడం లాంటి నైపుణ్యాలతో తొలిసారి ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. మిడిలార్డర్‌ వైఫల్యంతో ఇన్నింగ్స్‌ చివర్లో వేగంగా ఆడే ఆటగాడు లేక గత సీజన్‌లో వెనకబడ్డ పంజాబ్‌ కింగ్స్‌కు ఈ సారి షారుక్‌ కీలకం కానున్నాడు.


ఆ కలకు దగ్గరగా..

కేరళ యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ ఇంట్లోని ఓ గోడపై వరుసగా.. ఐపీఎల్, ఒక రంజీ సీజన్‌లో నాలుగు శతకాలు, సొంత ఇళ్లు, బెంజ్‌ కారు, 2023 ప్రపంచకప్‌ అని రాసి ఉంటుంది. ఇవన్నీ అతని కలలు. అందులో మొదటిదైన ఐపీఎల్‌లో ఆడాలనే లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచాడు. వేలంలో కనీస ధర రూ.20 లక్షలకే అతణ్ని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంది. తక్కువ ధరకే అమ్ముడుపోయాడని అతని నైపుణ్యాలను తక్కువ చేసి చూడాల్సిన అవసరమే లేదు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబయి లాంటి అగ్రశ్రేణి జట్టుపై.. అదీ ఛేదనలో అతనాడిన 137 పరుగుల సంచలన ఇన్నింగ్సే అందుకు కారణం. ఓ టీ20 మ్యాచ్‌లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్న అతని పేరు మార్మోగింది. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసే సామర్థ్యంతో పాటు వికెట్‌కీపింగ్‌లో చురుకుదనంతో ఆకట్టుకుంటున్నాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లున్న ఆర్సీబీలో కనీసం ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చినా రాణించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ 27 ఏళ్ల బ్యాట్స్‌మన్‌.. ఇప్పటివరకూ 24 టీ20 మ్యాచ్‌ల్లో 142.27 స్ట్రైక్‌రేట్‌తో 451 పరుగులు చేయడం విశేషం.


వారసుడొస్తున్నాడు..

సచిన్‌ తెందుల్కర్‌.. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న భారత క్రికెట్‌ దిగ్గజం. ఇప్పుడేమో మరో తెందుల్కర్‌ ఆటలో ఉన్నత శిఖరాలకు ఎదిగే దిశగా సాగుతున్నాడు. తన తండ్రి బాటలో నడుస్తూ తొలిసారి ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతనే.. అర్జున్‌ తెందుల్కర్‌. ఈ సీజన్‌ కోసం ముంబయి ఇండియన్స్‌ అతణ్ని కనీస ధర రూ.20 లక్షలకు తీసుకుంది. సచిన్‌ తనయుడని కాకుండా పూర్తిగా తన నైపుణ్యాల ఆధారంగానే అతణ్ని కొనుగోలు చేశామని ఆ జట్టు ప్రతినిధులు చెప్పడమే ఈ 21 ఏళ్ల పేస్‌ ఆల్‌రౌండర్‌ ప్రతిభకు నిదర్శనం. ముంబయి తరపున వివిధ వయసు విభాగాల్లో ఆడిన అతను లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడమే కాకుండా.. బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. ఈ సీజన్‌లో అవకాశం వస్తే తానెంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సారి లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.


వేగంతో దూసుకొస్తున్నారు..

ఐపీఎల్‌ అరంగేట్రం కోసం వేగంతో దూసుకొస్తున్నారు.. యువ పేసర్లు చేతన్‌ సకారియా, లక్మన్‌ మెరివాలా. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తమ ప్రదర్శనతో అదరగొట్టిన వీళ్లు ఫ్రాంఛైజీలను ఆకర్షించారు. ముఖ్యంగా 23 ఏళ్ల లెఫ్టార్మ్‌ పేసర్‌ చేతన్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.1.2 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం. ముస్తాక్‌ అలీ టోర్నీలో అయిదు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసిన ఈ సౌరాష్ట్ర పేసర్‌.. కేవలం 4.9 ఎకానమీ మాత్రమే నమోదు చేయడం తన నైపుణ్యాలకు తార్కాణం. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరపున రాణించేందుకు లక్మన్‌ ఎదురు చూస్తున్నాడు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన ఈ బరోడా లెఫ్టార్మ్‌ పేసర్‌ను దిల్లీ రూ.20 లక్షలకు దక్కించుకుంది. దూకుడైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించే అతనికి లీగ్‌లో ఆడే అవకాశం దక్కుతుందేమో చూడాలి.


మనోళ్లున్నారు..

తొలిసారి ఐపీఎల్‌లో ఆడాలనే లక్ష్యంతో ఉన్న తెలుగు క్రికెటర్లు.. కేఎస్‌ భరత్, హరిశంకర్‌ రెడ్డి, భగత్‌ వర్మ తమ సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నేళ్లుగా భారత్‌- ఎ తరపున నిలకడైన ప్రదర్శన చేస్తున్న భరత్‌ను కనీస ధర రూ.20 లక్షలకు ఆర్సీబీ తీసుకుంది. ఈ లీగ్‌తో తన దశ తిరుగుతుందనే నమ్మకంతో ఈ 27 ఏళ్ల వైజాగ్‌ ఆటగాడున్నాడు. మరోవైపు కనీస ధర చెరో రూ.20 లక్షలకు హరిశంకర్, భగత్‌ వర్మను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంది. ఇటీవల ప్రాక్టీస్‌లో భాగంగా ధోని వికెట్‌ను ఎగరగొట్టిన 22 ఏళ్ల కడప పేసర్‌ హరిశంకర్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. మంచి వేగంతో నిలకడగా సరైన లెంగ్త్‌లో బంతులు వేసే అతను ఇప్పటివరకు 13 టీ20ల్లో 19 వికెట్లు తీశాడు. మరోవైపు హైదరాబాదీ యువ స్పిన్నర్‌ భగత్‌ కూడా ఆసక్తి రేపుతున్నాడు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన