అప్పుడు పసిడి గెలిచి.. ఇప్పుడు Coronaతో ఓడి

ప్రధానాంశాలు

Updated : 09/05/2021 07:00 IST

అప్పుడు పసిడి గెలిచి.. ఇప్పుడు Coronaతో ఓడి

వైరస్‌తో మరణించిన మాజీ హాకీ ఆటగాళ్లు

దిల్లీ: 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టులో సభ్యులైన రవిందర్‌ పాల్‌ సింగ్‌, ఎమ్‌కే కౌశిక్‌ కరోనాతో పోరులో ఓడారు. మహమ్మారి కారణంగా శనివారమే ఈ ఇద్దరు మాజీ హాకీ ఆటగాళ్లు మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే జట్టు తరపున ఆడి.. ఒలింపిక్స్‌ పసిడి అందుకున్న ఈ ఇద్దరూ.. ఒకే రోజు తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్ల రవిందర్‌ రెండు వారాల పాటు వైరస్‌తో యుద్ధం చేసి తుదకు ప్రాణాలు కోల్పోయాడు. లఖ్‌నవూలోని ఓ ఆసుత్రిలో ఆయన కన్నుమూశాడు. గురువారం ఆయనకు నెగెటివ్‌గా తేలడంతో వేరే వార్డుకు తరలించారు. కానీ ఆ తర్వాత ఆయన పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 1984 ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిథ్యం వహించిన ఆయన పెళ్లి చేసుకోలేదు. మరోవైపు జాతీయ సీనియర్‌ పురుషుల, మహిళల జట్లకు కోచ్‌గానూ పనిచేసిన 66 ఏళ్ల కౌశిక్‌ గత మూడు వారాలుగా వైరస్‌తో పోరాడి తుదిశ్వాస విడిచాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌ అవతారమెత్తిన ఆయన గొప్పగా రాణించి ద్రోణాచార్య అవార్డు సైతం అందుకున్నాడు. ఆయన శిక్షణలో భారత పురుషుల జట్టు 1998 ఆసియా క్రీడల్లో స్వర్ణం, మహిళల జట్టు 2006 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాయి. రవిందర్‌, కౌశిక్‌ మృతి పట్ల కేంద్ర క్రీడల మంత్రి కిరెన్‌ రిజిజుతో పాటు హాకీ ఇండియా ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. మరోవైపు భారత మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌తో పాటు తెలుగమ్మాయి రజని కరోనా నుంచి కోలుకుంది. వీళ్లతో పాటు మరో అయిదుగురు సహచర క్రీడాకారిణులు, ఇద్దరు సహాయక సిబ్బంది మహమ్మారిని జయించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన