Srilanka Tour: సారథి ఎవరు?
close

ప్రధానాంశాలు

Updated : 12/05/2021 07:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Srilanka Tour: సారథి ఎవరు?

ముంబయి: కోహ్లీసేన ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉండగా.. జులైలో మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో లంకలో టీమ్‌ఇండియా మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కూడా ధ్రువీకరించాడు. అయితే మూడు ఫార్మాట్ల కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు వన్డేలు, టీ20ల్లో జట్టు వైస్‌ కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ సైతం ఇంగ్లాండ్‌లో ఉండగా.. లంకలో భారత జట్టును నడిపించేదెవరన్నది ఇప్పుడు ప్రశ్న. ఇందుకు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్‌గా మొదటి ప్రాధాన్యం భవిష్యత్‌ సారథిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్‌ అయ్యర్‌కే. ఇప్పటికే ఐపీఎల్‌లో అతను కెప్టెన్‌గా రుజువు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్‌-14 ముంగిట ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అతడి భుజానికి తీవ్ర గాయమైంది. తర్వాత శస్త్రచికిత్స చేయించుకుని కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ గాయం మాని మళ్లీ మైదానంలో దిగడానికి దాదాపు నాలుగు నెలలు పడుతుందని వార్తలొచ్చాయి. మరి జులైలో లంక పర్యటన ఆరంభ సమయానికి అయ్యర్‌ కోలుకుంటాడా అన్నది ప్రశ్న. అయ్యర్‌ ఈ పర్యటనకు అందుబాటులో ఉంటే వన్డేలు, టీ20ల్లో అతనే జట్టును నడిపిస్తాడు. లేదంటే సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యల్లో ఒకరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. గత ఐపీఎల్‌తో పాటు మధ్యలో ఆగిపోయిన ఈ సీజన్లోనూ ధావన్‌ చక్కటి ప్రదర్శన చేశాడు. లంకకు వెళ్లే జట్టులో అతనే అత్యంత అనుభవజ్ఞుడు. అలాగే ఎనిమిదేళ్లుగా టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడిగా జట్టుకు ఎన్నో విజయాలందించడమే కాక, ఐపీఎల్‌లోనూ కొన్ని మ్యాచ్‌ల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ధావన్‌కు కలిసొచ్చేదే. వర్ధమాన ఆటగాడికే బాధ్యతలు ఇవ్వాలనుకుంటే సెలక్టర్లు హార్దిక్‌ వైపు చూడొచ్చు. గత కొన్నేళ్లలో అతను టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా మారాడు. ధోని తర్వాత ఫినిషర్‌ పాత్రకు భారత్‌ ఎక్కువ ఆశలు పెట్టుకుంది హార్దిక్‌ మీదే. అయితే వెన్నుకు శస్త్ర చికిత్స చేయించుకున్నాక ఎక్కువగా బౌలింగ్‌ చేయకపోవడం వల్ల పాండ్య ప్రాధాన్యం తగ్గింది. టీ20 ప్రపంచకప్‌ అతను నుంచి ఆల్‌రౌండర్‌ పాత్ర పోషించాలని కోరుకుంటున్న నేపథ్యంలో.. లంకలో అతను కొన్ని మ్యాచ్‌ల్లో అయినా బౌలింగ్‌ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ ఇస్తే అతను మరింత బాధ్యతాయుతంగా ఆడే అవకాశముంటుందని భావిస్తున్నారు. మరి సెలక్టర్ల ఆలోచన ఎలా ఉందో.. లంక పర్యటనకు జట్టు ఎంపిక చేసినపుడు వాళ్లు ఎవరికి సారథ్య బాధ్యతలు కట్టబెడతారో చూడాలి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన