పట్టిక ఎక్కిస్తారా?

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

పట్టిక ఎక్కిస్తారా?

 నేడు అయిదు పతక ఈవెంట్లలో భారత క్రీడాకారులు

 షూటర్లపై భారీ ఆశలు..

 బరిలో దీపిక-ప్రవీణ్‌, మీరాబాయి

అయిదేళ్ల కిందట రియోలో భారత క్రీడాకారులపై ఎన్నో అంచనాలు! రెండంకెలో పతకాలు ఖాయమని.. షూటర్లు పతకాల పంట పండించేస్తారని.. రెజ్లర్లు, బాక్సర్లు కూడా అదరగొట్టేస్తారని.. ఎన్నో ఆశలతో చూస్తే.. అందరూ తీవ్ర నిరాశకు గురి చేశారు. రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి మన క్రీడాకారులు కచ్చితంగా కథ మారుస్తారన్న ఆశ అందరిలోనూ ఉంది. టోక్యోలో పతక ఈవెంట్లకు శ్రీకారం నేడే. భారత క్రీడాకారులు నాలుగు క్రీడాంశాల్లో అయిదు పతక ఈవెంట్లలో పోటీ పడుతున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌ మొదలై ఒక రోజు గడిచిపోయింది. కానీ విశ్వ క్రీడలకు అసలు ఆరంభం శనివారమే. ఈ రోజు నుంచే పతక ఈవెంట్లు మొదలవుతున్నాయి. ఇందులో భారత క్రీడాకారులు పోటీ పడుతున్న క్రీడాంశాలూ ఉన్నాయి. ముఖ్యంగా భారత అభిమానులు అత్యధిక ఆశలు పెట్టుకున్న షూటర్లు పతక ఈవెంట్లున్న తొలి రోజే బరిలోకి దిగుతున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పోటీలో సౌరభ్‌ చౌదరి, అభిషేక్‌ వర్మ పోటీ పడుతున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్లో అపూర్వి చందేలా, ఎలవినెల్‌ వలేరియన్‌ పోటీ పడుతున్నారు. ఇక శుక్రవారం ర్యాంకింగ్‌ ఈవెంట్లో అంచనాలను అందుకోలేకపోయిన ఆర్చర్లు.. తర్వాతి రోజు అసలు పోరుకు సిద్ధమవుతున్నారు. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో దీపికా కుమారి-ప్రవీణ్‌ జాదవ్‌ జోడీ బరిలోకి దిగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ ఏకైక ఆశ మీరాబాయి 49 కేజీల విభాగంలో పతకం కోసం పోటీ పడనుంది. జూడోలో సుశీల కూడా పోటీదారే.

తొలి అడుగు ఎలా..: శనివారం పతకం తేలే ఈవెంట్లతో పాటు భారత్‌కు మరికొన్ని ముఖ్యమైన పోటీలున్నాయి. భారత పురుషుల హాకీ జట్టు.. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. మహిళల హాకీ జట్టు కూడా శనివారమే నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. మరోవైపు బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌.. జిల్బర్‌మన్‌తో తొలి మ్యాచ్‌ ఆడబోతున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌ శెట్టి జోడీ.. లీ యాంగ్‌-వాంగ్‌ చి లిన్‌ (చైనీస్‌ తైపీ) జంటతో ఆరంభ మ్యాచ్‌ ఆడనున్నారు. భారత్‌కు పతకాలు ఖాయమని ఆశిస్తున్న బాక్సింగ్‌లో.. వికాస్‌ కృష్ణన్‌ (69 కేజీలు) శనివారం బరిలోకి దిగుతున్నాడు. ఇక టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో పెద్దగా అంచనాల్లేని సానియా మీర్జా-అంకితా రైనా.. పురుషుల సింగిల్స్‌లో సుమీత్‌ నగాల్‌ శనివారమే తొలి మ్యాచ్‌లు ఆడతారు. టేబుల్‌ టెన్నిస్‌లో కూడా భారత క్రీడాకారుల మ్యాచ్‌లు నేడే ఆరంభం కానున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన