స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ అంటే?

ప్రధానాంశాలు

Published : 25/07/2021 02:24 IST

స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ అంటే?

భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ఒలింపిక్స్‌లో గొప్ప ప్రదర్శనతో రజతం పట్టేసింది. స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో బరువులెత్తి పతకం సాధించింది. అసలు ఈ స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జర్క్‌ అంటే ఏమిటో తెలుసా?

స్నాచ్‌

* స్నాచ్‌లో లిఫ్టర్లు బరువులను ఏకబిగిన పైకెత్తుతారు.

* బరువులతో కూడిన రాడ్డుపై పట్టు కోసం వెయిట్‌లిఫ్టర్లు రెండు చేతుల మధ్యలో వీలైనంత ఎక్కువ దూరం ఉండేలా దాన్ని పట్టుకుంటారు.

* మోకాళ్లపై భారం పడేలా కూర్చుని (బస్కీలు తీసినట్లుగా) ఒక్కసారిగా బార్‌ను ఎత్తుతారు. అది నడుం వరకూ రాగానే చీలమండలు, మోకాళ్లు, నడ్డి ఆధారంగా పూర్తి బలాన్ని తెచ్చుకుని ఆ బరువును తలపైకి తీసుకెళ్తారు.

* ఆ సమయంలో ఎత్తిన బరువు కారణంగా కిందకు వంగిన శరీరాన్ని నిటారు చేస్తూ నిలబడతారు. ఇలా చేస్తేనే స్నాచ్‌ పూర్తి చేసినట్లు పరిగణిస్తారు. ఒకవేళ బరువెత్తిన తర్వాత నిలబడకపోయినా, శరీరం ఎక్కువగా వణికినా విఫలమైనట్లే.


క్లీన్‌ అండ్‌ జెర్క్‌

* స్నాచ్‌ ఫిట్‌నెస్‌కు పరీక్షగా నిలిస్తే.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ మాత్రం వెయిట్‌లిఫ్టర్ల ముడి శక్తికి సవాలు విసిరేలా ఉంటుంది.

* దీంట్లో క్లీన్‌, జెర్క్‌ అనే రెండు అంశాలు ఉన్నప్పటికీ దీన్ని ఒకేసారి పూర్తి చేస్తారు.

* బరువు ఎత్తడానికి బార్‌ను పట్టుకునేటప్పుడు రెండు చేతుల మధ్య దూరాన్ని తగ్గిస్తారు.

* కిందకు వంగి మోకాళ్లపై భారం పడేలా కూర్చుని ఒక్కసారిగా బార్‌ను ఎత్తి ఛాతీపైనా పెట్టుకుంటారు. దీంతో క్లీన్‌ పూర్తయినట్లు.

* బరువు ఎత్తడంతో మళ్లీ బస్కీలు తీస్తున్నట్లు కూర్చునే స్థితికి వెయిట్‌లిఫ్టర్లు వస్తారు.

* ఇప్పుడు ఆ బరువుతో పాటు లేచి ఆ బార్‌ను తలపైకి ఎత్తాల్సి ఉంటుంది. అలా చేసి నియంత్రణ కోల్పోకుండా ఉంటే జెర్క్‌ పూర్తవుతుంది. ఇలా క్లీన్‌ అండ్‌ జెర్క్‌ ముగుస్తుంది. స్నాచ్‌తో పోలిస్తే క్లీన్‌ అండ్‌ జెర్క్‌లోనే వెయిట్‌లిఫ్టర్లు ఎక్కువ బరువులు 

ఎత్తుతారు. తల మీదకు బార్‌ను ఎత్తేకంటే ముందు ఛాతీపైన పెట్టుకునే అవకాశం ఉండడమే అందుకు కారణం.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన