అయిదేళ్లలో 5రోజులే ఇంట్లో ఉన్నా

ప్రధానాంశాలు

Published : 25/07/2021 02:34 IST

అయిదేళ్లలో 5రోజులే ఇంట్లో ఉన్నా

 ఒలింపిక్‌ పతకం కోసం ఎన్నో త్యాగాలు

 అమ్మాయిలు ఏదైనా సాధిస్తారు

మీరాబాయి చాను ఇంటర్వ్యూ

టోక్యో ఒలింపిక్స్‌లో తన రజత పతక విజయం తర్వాత దేశంలో కొందరైనా అమ్మాయిలు క్రీడారంగంలో అడుగు పెడతారని మీరాబాయ్‌ చాను ఆశాభావం వ్యక్తంజేసింది. అమ్మాయిలు తల్చుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చాను తెలిపింది. ఒలింపిక్స్‌ పతకం కోసం ఎన్నో త్యాగాలు చేశానని చెప్పింది. టోక్యోలో పతకం సాధించిన తర్వాత చాను ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలివీ..

ఒలింపిక్స్‌ పతకానంతరం చేయబోతున్న మొదటి పని ?
పిజ్జా తినడం. పిజ్జా తిని చాలా ఏళ్లయింది. ఈరోజు కోసం చాలా కష్టపడ్డా. ఎంతగానో ఎదురుచూశా. ఇప్పుడు పిజ్జాకు సమయం వచ్చింది.


ఒలింపిక్స్‌ పతకం కోసం ఎలాంటి త్యాగాలు చేశారు?
ఎన్నో త్యాగాలు చేశా. గత అయిదేళ్లలో కేవలం 5 రోజులు మాత్రమే ఇంట్లో ఉన్నా. నచ్చిన ఆహారం తినలేకపోయా. కుటుంబ సభ్యుల్ని కలవలేకపోయా. పూర్తిగా శిక్షణపైనే దృష్టిసారించా. వేరే విషయాల గురించి అస్సలు ఆలోచించలేదు. ఈ పతకం కోసమే అదంతా.


పతకం గెలిచిన తర్వాత అమ్మతో మాట్లాడారా?
రెండు నిమిషాలు అమ్మతో మాట్లాడా. పొద్దుట్నుంచి ఇంట్లో ఎవరూ ఏమీ తినలేదు. నా ఈవెంట్‌ పూర్తయ్యే వరకు తినకూడదని అనుకున్నారు. పతకం సాధించగానే అందరూ సంబరాలు చేసుకున్నారు. ఊళ్లో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఇంటికి వెళ్లిగానే అమ్మ చేతి వంట తింటా. అందరినీ కలుస్తా.


రియోలో వైఫల్యం మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది?
2016 రియో ఒలింపిక్స్‌లో చాలా ప్రయత్నించా. ఎంతో కష్టపడ్డా. కాని ఆ రోజు నాది కాదు. నేనేంటో టోక్యోలో నిరూపించుకుంటానని ఆరోజే అనుకున్నా. రియోలో విఫలమైన రోజు చాలా విషయాలు నేర్చుకున్నా. శిక్షణ, టెక్నిక్‌లో ఎన్నో మార్పులు చేసుకున్నా. ఇందుకోసం ఎంతగానో కష్టపడ్డాం. రియో తర్వాత మానసికంగానూ కుంగిపోయా. చాలా బాధపడ్డా. నాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యా. చాలారోజుల వరకు నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత కోచ్‌, సమాఖ్య నాకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. నాలో ప్రతిభకు కొదవలేదంటూ ఆత్మవిశ్వాసం నింపారు.


అమెరికాలో శిక్షణ ఎలా ఉపయోగపడింది?
ఆఖరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమిది. ఆసియా ఛాంపియన్‌షిప్‌ తర్వాత 2, 3 నెలలు అమెరికాలో శిక్షణ తీసుకుంటే బాగుండేదని అనుకున్నాం. కరోనా రెండో దశ నేపథ్యంలో అమెరికాకు వెళ్లే విమానాలపై ఆంక్షలు విధిస్తున్నారు. సరిగ్గా ఒకరోజు ముందు అమెరికా విమానం ఎక్కాం. అక్కడ కోచ్‌ విజయ్‌శర్మ ఆధ్వర్యంలో నేను శిక్షణ తీసుకున్నా. టోక్యోకు ముందు అమెరికాలో శిక్షణ చాలా ఉపయోగపడింది.


మీ పతకంతో ఎలాంటి మార్పు ఆశిస్తున్నారు?
కచ్చితంగా మార్పు ఉంటుంది. నన్ను చూసి కొందరైనా అమ్మాయిలు క్రీడారంగంలో అడుగుపెడతారు. తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను ప్రోత్సహించాలి. కేవలం చదువుకే పరిమితం చేయొద్దు. నచ్చిన రంగంలో.. ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. అమ్మాయిలు తల్చుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. క్రీడల్లో దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురాగలరు. అమ్మాయిల్ని క్రీడల్లోకి వచ్చేలా చేయండి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన