డబుల్స్‌లో అదుర్స్‌

ప్రధానాంశాలు

Updated : 25/07/2021 05:26 IST

డబుల్స్‌లో అదుర్స్‌

మూడో ర్యాంక్‌ జోడీకి సాత్విక్‌ జంట షాక్‌
హాకీ జట్టు స్ఫూర్తిదాయక విజయం
నిరాశపరిచిన షూటర్లు, ఆర్చర్లు

ఒక పతకం రెండు కావాల్సింది.. కానీ గురి కుదర్లేదు. ఆరంభంలో అదరగొట్టిన స్టార్‌ షూటర్‌ సౌరభ్‌ చౌదరి ఆఖరి పోరులో నిరాశపరిచి ఉసూరుమనిపించాడు. అటు బాణాలు లక్ష్యాన్ని చేరలేదు.. టీటీలోనూ తడబాటే. అలాగని అన్ని వైఫల్యాలే కాదు.. బ్యాడ్మింటన్‌, హాకీ, టెన్నిస్‌లో స్ఫూర్తిదాయక విజయాలు ఉత్సాహపరిచేవే. సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ప్రపంచ నం.3 జంటకు షాకివ్వగా.. హాకీలో భారత జట్టు శుభారంభం చేసింది. అనుకోకుండా ఒలింపిక్‌ అవకాశం దక్కించుకున్న సుమిత్‌ నగాల్‌ రెండో రౌండ్‌కు చేరడం విశేషం.

టోక్యో

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి అదరగొట్టింది. తొలి ఒలింపిక్స్‌ ఆడుతున్న ఈ జంట సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన డబుల్స్‌ తొలి రౌండ్లో సాత్విక్‌-చిరాగ్‌ 21-16, 16-21, 27-25తో ప్రపంచ మూడో ర్యాంక్‌ జోడీ చెంగ్‌ లీ-వాంగ్‌ (చైనీస్‌ తైపీ)ను కంగుతినిపించారు. గంటకు పైగా సాగిన ఈ పోరులో విజయం ఇరు జోడీలతో దోబూచులాడింది. తొలి గేమ్‌లో దూకుడుగా ఆడి 11-7తో ఆధిక్యంలో నిలిచిన భారత ద్వయం.. అదే ఊపులో గేమ్‌ గెలిచింది. రెండో గేమ్‌లో చెంగ్‌-వాంగ్‌ పుంజుకోవడంతో 8-10తో పోరు రసవత్తరంగా సాగింది. కానీ విరామం తర్వాత చెలరేగిన చైనీస్‌ తైపీ జంట 21-16తో గేమ్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఈ మ్యాచ్‌కే హైలైట్‌. సుదీర్ఘ ర్యాలీలతో సాగిన ఈ గేమ్‌లో రెండు జోడీలు తగ్గకపోవడంతో స్కోర్లు సమమవుతూ వచ్చాయి. అయితే 26-25తో ఆధిక్యంలోకి వెళ్లిన సాత్విక్‌-చిరాగ్‌ అదే జోరుతో పాయింట్‌ నెగ్గి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో సాయిప్రణీత్‌కు షాక్‌ తగిలింది. అతడు 17-21, 15-21తో ప్రపంచ 47వ ర్యాంకర్‌ మిషా జిల్బర్‌మ్యాన్‌ (ఇజ్రాయిల్‌) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు.


హాకీలో పోరాడి..

 సుదీర్ఘ విరామం తర్వాత పతకం సాధించాలని ఆశపడుతున్న భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. తొలి పోరులో 3-2 గోల్స్‌తో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో మొదట అటాకింగ్‌తో అదరగొట్టిన మన్‌ప్రీత్‌ సేన చివర్లో పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి దూకుడుకు చెక్‌ పెట్టింది. ఈ మ్యాచ్‌ ఆరంభంలో పెనాల్టీ కార్నర్‌ను రసెల్‌ (6వ నిమిషం) గోల్‌ చేయడంతో కివీస్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ రూపీందర్‌ పాల్‌ (10వ నిమిషం) బంతిని నెట్‌లోకి పంపడంతో భారత్‌ వెంటనే స్కోరు సమం చేసింది. అక్కడ నుంచి మనదే ఆట. రెండో క్వార్టర్‌లో లభించిన పెనాల్టీకార్నర్లను హర్మన్‌ప్రీత్‌ (33, 43వ ని) గోల్స్‌ చేయడంతో భారత్‌ 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆ వెనుకే విల్సన్‌ (43వ ని) కొట్టిన గోల్‌తో కివీస్‌ 2-3తో భారత్‌ను సమీపించింది. నాలుగో క్వార్టర్‌ చివరి వరకు భారత్‌దే పైచేయి. కానీ కివీస్‌ వరుసగా మూడు పెనాల్టీకార్నర్‌లు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచింది. అయితే ఈ మూడు ప్రయత్నాలను గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. చివరి వరకు అదే డిఫెన్స్‌ను కొనసాగించిన భారత్‌ విజయాన్ని అందుకుంది. మరోవైపు మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో చుక్కెదురైంది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో రాణీ రాంపాల్‌ బృందం 1-5తో నెదర్లాండ్స్‌ చేతిలో చిత్తయింది.


షూటింగ్‌, ఆర్చరీలో నిరాశ

షూటర్లు, ఆర్చర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. ముఖ్యంగా 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో పసిడి పతకానికి గట్టి పోటీదారుగా ఉన్న సౌరభ్‌ చౌదరి ఫైనల్లో ఏడో స్థానంలో నిలవడం అభిమానులకు శరాఘాతమే. క్వాలిఫయింగ్‌లో 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన సౌరభ్‌ జోరు చూస్తే అతడికి పతకం పక్కా అనిపించింది. అయితే తుది పోరులో ఆరంభంలోనే వెనకబడిన ఈ టీనేజర్‌ మొత్తం మీద 137.4 పాయింట్లే సాధించి.. ఎనిమిది మంది పాల్గొన్న పోటీలో ఏడో స్థానంలో నిలిచాడు. మరో షూటర్‌ అభిషేక్‌ వర్మ (575) 17వ స్థానంలో నిలిచి తుది పోరుకు కూడా చేరలేకపోయాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లోనూ భారత్‌కు కలిసి రాలేదు. ఫేవరెట్‌గా బరిలో దిగిన ఇలవేనిల్‌ (626.5) క్వాలిఫయింగ్‌లో 16వ స్థానంలో నిలిచి తుది పోరుకు దూరం కాగా.. పతకంపై ఆశలు రేపిన అపూర్వి చందెలా (621.9) మరింత దారుణంగా విఫలమై 36వ స్థానంలో నిలిచింది. ఆర్చరీలో భారత మిక్స్‌డ్‌ జోడీ క్వార్టర్స్‌లోనే ఓడింది. దీపిక కుమారి-ప్రవీణ్‌ జాదవ్‌ 2-6తో కొరియా జంట ఆన్‌సాన్‌-కిమ్‌ డెక్‌ చేతిలో పరాజయం చవిచూశారు. దీపికతో ఎప్పుడూ బరిలో దిగే అతాను దాస్‌ను కాకుండా జాదవ్‌ను దించడం భారత్‌ను దెబ్బ తీసింది.


టీటీ, జూడో, రోయింగ్‌లో కూడా..

టేబుల్‌ టెన్నిస్‌లో నిరాశే ఎదురైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పతక అవకాశాలు ఉన్నాయనుకున్న ఆచంట శరత్‌ కమల్‌-మనిక బాత్రా ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు శరత్‌-మనిక 0-4తో లిన్‌యున్‌-చెంగ్‌ చిగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడారు. సింగిల్స్‌లో మనిక, సుతీర్థ ముఖర్జీ ముందంజ వేశారు. తొలి రౌండ్లో మనిక 4-0తో తిన్‌ తిన్‌ హో (బ్రిటన్‌)ను ఓడించగా.. సుతీర్థ 4-3తో లిండా (స్వీడన్‌)పై నెగ్గింది. జూడోలో భారత్‌కు పరాజయమే ఎదురైంది. జూడో తొలి రౌండ్లో సుశీలాదేవి.. ఇవా సెర్‌నోవిచ్‌ (హంగేరి) చేతిలో ఓడింది. రోయింగ్‌లో భారత జోడీ అరవింద్‌ -అర్జున్‌ రెపిచేజ్‌ రౌండ్‌కు అర్హత సాధించింది. పురుషుల డబుల్‌ స్కల్‌లో ఈ జంట హీట్స్‌లో 6:40.33 టైమింగ్‌తో సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. అయితే రెపిచేజ్‌లో సత్తా చాటితే వీరికి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.


పేస్‌ తర్వాత నగాల్‌

టెన్నిస్‌లో సుమిత్‌ నగాల్‌ రెండో రౌండ్లో ప్రవేశించాడు. సింగిల్స్‌ తొలి రౌండ్లో నగాల్‌ 6-4, 6-7 (6/8), 6-4తో తనకన్నా మెరుగైన ఆటగాడైన డెన్నిస్‌ ఇస్తోమిన్‌ (ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించాడు. 25 ఏళ్లలో టెన్నిస్‌ సింగిల్స్‌లో రెండో రౌండ్‌ చేరిన తొలి భారత ఆటగాడు నగాలే. మొత్తం మీద మూడో భారతీయుడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో చివరిగా లియాండర్‌ పేస్‌ తొలి రౌండ్‌ అధిగమించడమే కాక కాంస్యం గెలిచాడు. 1988 క్రీడల్లో జీషన్‌ అలీ తొలి రౌండ్లో నెగ్గాడు.


వికాస్‌ తొలి రౌండ్లోనే..

బాక్సింగ్‌లో వికాస్‌ కృషన్‌ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. 69 కిలోల తొలి రౌండ్లో వికాస్‌ 0-5తో స్థానిక ఆటగాడు ఒకాజవా చేతిలో ఓడాడు. ఈ బౌట్‌ ఆడుతుండగా ఎడమ కంటి కింద గాయం కావడంతో ఇబ్బంది పడ్డ వికాస్‌.. భుజానికి గాయం కావడంతో పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయాడు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన