కరవు తీరుస్తారా?

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:40 IST

కరవు తీరుస్తారా?

సౌరభ్‌-మను జోడీపై భారీ అంచనాలు
బరిలో అభిషేక్‌-యశస్విని కూడా
నేడు 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌

‘‘బరిలో ఉన్న 16 మంది షూటర్లూ పతకాలు గెలవగల సత్తా ఉన్న వాళ్లే. కనీసం మూణ్నాలుగు పతకాలు ఖాయం’’.. ఇదీ ఒలింపిక్స్‌ ముంగిట ఉన్న అంచనా. అయితే పతక పోటీల తొలి మూడు రోజుల్లో బరిలోకి దిగిన ఒక్క ఈవెంట్లోనూ షూటర్లు ఖాతా తెరవలేదు. సౌరభ్‌ చౌదరి, మను బాకర్‌ సహా అందరూ విఫలమయ్యారు. కనీసం షూటింగ్‌లో ఒక్క పతకమైనా వస్తుందా లేక రియోలో మాదిరే రిక్తహస్తమేనా అన్న ఆందోళన కలుగుతోందిప్పుడు. ఇలాంటి సమయంలో భారత్‌కు మంచి అవకాశాలున్నట్లుగా భావిస్తున్న ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మన జోడీలు రెండు బరిలోకి దిగుతున్నాయి. ఇందులో సౌరభ్‌ చౌదరి-మను బాకర్‌ జోడీపై భారీ అంచనాలే ఉన్నాయి. 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్లలో పతకాలు గెలుస్తారనుకున్న ఈ ఇద్దరికీ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పురుషుల క్వాలిఫయింగ్‌ రౌండ్లో అగ్రస్థానం సాధించిన సౌరభ్‌.. ఫైనల్లో ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. మహిళల క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ మధ్యలో తన పిస్టల్‌ మొరాయించడం మనుకు ప్రతికూలమైంది. సౌరభ్‌-మను జోడీకి ప్రపంచకప్‌ సహా పలు ఈవెంట్లలో పతకాల పంట పండించిన రికార్డుంది. ఒలింపిక్స్‌లో ఈ జోడీ 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో స్వర్ణం గెలుస్తుందన్న అంచనాలున్నాయి. వ్యక్తిగత ఈవెంట్లలో దెబ్బ తిన్న ఈ ఇద్దరూ జంటగా కసిని ప్రదర్శించి భారత్‌కు పతకం అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదే ఈవెంట్లో పోటీ పడుతున్న అభిషేక్‌ వర్మ, యశస్విని దేశ్వాల్‌ సైతం వ్యక్తిగత ఈవెంట్లలో నిరాశపరిచారు. ఈ జోడీ అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన