కమల్‌ ఒక్కడే..

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:51 IST

కమల్‌ ఒక్కడే..

టీటీలో మూడో రౌండ్లో ప్రవేశం
మనిక, సుతీర్థ ఇంటిముఖం
ఫెన్సర్‌ భవాని, బాక్సర్‌ ఆశిష్‌ ఔట్‌
భారత్‌కు కలిసిరాని మూడోరోజు

టోక్యో

ఆచంట శరత్‌కమల్‌ ఒక్కడే నిలిచాడు.. పరాజయాలే ఎక్కువ ఎదురైన ఒలింపిక్స్‌ మూడోరోజు ఆటల్లో అతడొక్కడే స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకున్నాడు. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో 39 ఏళ్ల కమల్‌ 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో తియాగో అపోలోనియా (పోర్చుగల్‌)ను ఓడించాడు. 49 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఆరంభంలో తడబడిన శరత్‌.. ఆ తర్వాత అనుభవాన్నంతా రంగరించి విజయం సాధించాడు. ముఖ్యంగా ఫలితాన్ని తేల్చే ఆరో గేమ్‌లో ఒత్తిడిని తట్టుకుంటూ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌ టీటీలో మూడో రౌండ్‌ చేరిన తొలి భారత క్రీడాకారుడు కమలే. మహిళల సింగిల్స్‌లో మనికతో పాటు సుతీర్థ ఓడిపోయారు. మనిక 8-11, 2-11, 5-11, 7-11తో పొల్‌కనోవా (ఆస్ట్రియా) చేతిలో.. సుతీర్థ 3-11,  3-11, 5-11, 5-11తో యుఫు (పోర్చుగల్‌) చేతిలో ఓడారు.

సాత్విక్‌ జోడీ ఓటమి

భారత స్టార్‌ డబుల్స్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌ శెట్టి జోడీకి చుక్కెదురైంది. గ్రూపు-ఎ రెండో పోరులో ప్రపంచ పదో ర్యాంకు జోడీ సాత్విక్‌- చిరాగ్‌ 13-21, 12-21తో ప్రపంచ నంబర్‌వన్‌ మార్కస్‌ గిడియాన్‌- కెవిన్‌ సుకముజో (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. శనివారం ప్రపంచ మూడో ర్యాంకు జంట యాంగ్‌ లీ- లిన్‌ వాంగ్‌ (చైనీస్‌ తైపీ)లను చిత్తుచేసి మంచి జోరు మీద కనిపించిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ సోమవారం తేలిపోయింది. కేవలం 32 నిమిషాల్లోనే మ్యాచ్‌ను కోల్పోయింది. తొలి గేమ్‌లో ఇండోనేసియా జోడీ 11-6తో పైచేయి సాధించింది. సాత్విక్‌- చిరాగ్‌ పోరాడి 9-13తో ప్రత్యర్థి జోడీని సమీపించారు. కానీ చిరాగ్‌ కాలి గాయంతో ఇబ్బంది పడటంతో ఇండోనేసియా జోడీకి ఎదురులేకుండా పోయింది. 8 పాయింట్లు గెలుచుకుని 21-13తో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో భారత జోడీ 6-3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే మార్కస్‌- కెవిన్‌లు గేరు మార్చి భారత జోడీని బోల్తాకొట్టించారు. 9-7.. 15-10.. ఇలా ఆధిక్యం పెంచుకుంటూ గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.

ఆర్చరీలో క్వార్టర్స్‌లోనే

ఆర్చరీలో భారత్‌కు మరో పరాభవం ఎదురైంది. అతానుదాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు మొదట ప్రిక్వార్టర్స్‌లో కజకిస్థాన్‌ను 6-2తో ఓడించింది. అయితే క్వార్టర్స్‌లో 0-6తో బలమైన కొరియా (కిమ్‌ డెక్‌, జిన్‌ హెక్‌, కిమ్‌ వుజిన్‌) చేతిలో చిత్తయింది. కొరియా ఆర్చర్లు స్థిరంగా 10 పాయింట్లు సాధించగా. భారత్‌ మాత్రం కీలక సమయాల్లో తడబడి ఓటమి చవిచూసింది. తొలి సెట్‌ను 54-59తో చేజార్చుకున్న భారత్‌.. రెండో సెట్లో 57-59తో, మూడో సెట్లో 54-56తో ఓడింది. తొలి 12 షాట్లలోనే కొరియా 10 పాయింట్ల షాట్లను 10 సార్లు సాధించడం విశేషం. ఇక ఆర్చరీలో భారత పోరాటం సింగిల్స్‌లోనే మిగిలి ఉంది.


నగాల్‌ చిత్తుగా..

టెన్నిస్‌లో సుమిత్‌ నగాల్‌ కూడా ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో నగాల్‌ 2-6, 1-6తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ డానియల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌లో సానియామీర్జా-అంకిత రైనా పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌ జోడీ బరిలో దిగే అవకాశాలు లేనట్టే. 


హాకీలో మరో ఓటమి

హాకీలో భారత మహిళల జట్టు   వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. పూల్‌-ఎ పోరులో భారత్‌ 0-2 గోల్స్‌తో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత జర్మనీ చేతిలో ఓడింది.


ఫెన్సింగ్‌లో అడుగేసి..

ఒలింపిక్స్‌లో ఎప్పుడూ అడుగుపెట్టని వేదికలో సోమవారం భారత్‌ పోటీపడింది. ఫెన్సింగ్‌లో భారత్‌ తరఫున భవానీదేవి బరిలో దిగింది. మహిళల తొలి రౌండ్లో 15-3తో నడియా బెన్‌ (ట్యూనీసియా)పై గెలిచిన భవాని.. రెండో రౌండ్లో 7-15తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ మానొన్‌ బ్రూనెట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పోరాడి ఓడింది. ‘‘విజయం సాధించడానికి వంద శాతం కష్టపడ్డా. అయితే తొలి అర్ధభాగంలో సరిగా రాణించలేకపోయా. ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున బరిలో దిగిన తొలి ఫెన్సర్‌గా   నిలవడం గర్వంగా ఉంది’’ అని భవాని చెప్పింది.


అంగద్‌ 18.. మిరాజ్‌ 25

షూటింగ్‌లో వైఫల్యాలు కొనసాగాయి. పురుషుల స్కీట్‌లో అంగద్‌ వీర్‌సింగ్‌ బజ్వా 18వ స్థానంలో నిలిచాడు. మిరాజ్‌ 25వ స్థానానికి పరిమితమయ్యాడు.


పంచ్‌ పడలేదు

బాక్సింగ్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఒలింపిక్స్‌ ఆడుతున్న ఆసియా రజత పతక విజేత ఆశిష్‌ కుమార్‌ (75 కిలోలు) పోటీల నుంచి నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ఆశిష్‌ 0-5తో తౌహెటా (చైనా) చేతిలో ఓడాడు. ఈ పోరులో ఆశిష్‌ పోరాడినా.. చైనా బాక్సర్‌ అతని కంటే దూకుడుగా ఆడి పైచేయి సాధించాడు. స్విమ్మింగ్‌లో సాజన్‌ ప్రకాశ్‌ విఫలమయ్యాడు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లైలో 1 నిమిషం 56:38 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సెమీస్‌ చేరలేకపోయాడు. 100 మీటర్ల బటర్‌ఫ్లైలో అతడు పోటీపడాల్సి ఉంది. స్విమ్మింగ్‌లో ఇప్పటికే మానా, శ్రీహరి ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించారు.


పతకం లేకుండా మరో రోజు

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో నిరాశాపూరిత రోజు. శనివారం మీరాబాయి చాను రజతం సాధించాక భారత్‌ ఖాతాలో మరో పతకం జమ చేస్తారని ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు వరుసగా రెండో రోజూ వెఫల్యాలు చవిచూశారు. ముఖ్యంగా షూటర్లు మరోసారి నిరాశకు గురి చేశారు. షూటింగే కాక ఆర్చరీ, టెన్నిస్‌, హాకీ, ఫెన్సింగ్‌, బాక్సింగ్‌.. ఇలా సోమవారం పోటీ పడ్డ మెజారిటీ క్రీడల్లో భారత క్రీడాకారులకు ఎదురు దెబ్బలు తగిలాయి. టేబుల్‌ టెన్నిస్‌లో ఒక్క శరత్‌ కమల్‌ మాత్రమే విజయంతో ముందంజ వేశాడు.


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన