సిరీస్‌ పట్టేస్తారా..!

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:53 IST

సిరీస్‌ పట్టేస్తారా..!

శ్రీలంకతో భారత్‌ రెండో టీ20 నేడు
రాత్రి 8 గంటల నుంచి

కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత్‌ రెండో సిరీస్‌పై గురిపెట్టింది. తొలి పోరులో శ్రీలంకను చిత్తుచేసిన శిఖర్‌ ధావన్‌ సేన రెండో మ్యాచ్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో టీమ్‌ఇండియా తలపడనుంది. ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌లకు విశ్రాంతినివ్వాలని జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయిస్తే తప్ప రెండో మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు చేయకపోవచ్చు. అయితే ఇద్దరు ఆటగాళ్లు మంగళవారం మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఈ పోరుతోనే సిరీస్‌ సొంతమైతే మూడో మ్యాచ్‌కు పృథ్వీ, సూర్యలకు విశ్రాంతినివ్వడం ఖాయమే. జట్టు మేనేజ్‌మెంట్‌ మదిలో రెండో ఆలోచన ఉంటే ఈ మ్యాచ్‌లో దేవదత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు అవకాశం రావొచ్చు. ఏదేమైనా ఇప్పుడు అందరి దృష్టి సంజు శాంసన్‌పైనే ఉంది. అద్భుతమైన ప్రతిభావంతుడిగా పేరున్న సంజు పొట్టి ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 8 టీ20 మ్యాచ్‌లాడిన సంజు 13.75 సగటుతో 110 పరుగులే చేశాడు. తన కంటే జూనియర్‌ అయిన రిషబ్‌ పంత్‌ ఎప్పుడో సంజును దాటుకుని చాలా ముందుకెళ్లాడు. కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా రాణిస్తున్నాడు. ఇషాన్‌ కిషన్‌ అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. వికెట్‌ కీపర్‌ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో రాహుల్‌ ద్రవిడ్‌ శిష్యుడు సంజు మిగిలిన రెండు మ్యాచ్‌ల్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ ఫామ్‌ టీమ్‌ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్‌లో సత్తాచాటిన భువనేశ్వర్‌ సారథ్యంలోని బౌలింగ్‌ విభాగంపై టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన