మీరా రజతం.. స్వర్ణమవుతుందా?

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:56 IST

మీరా రజతం.. స్వర్ణమవుతుందా?

డోప్‌ పరీక్షకు పసిడి విజేత

దిల్లీ: ఒలింపిక్స్‌ లాంటి మెగా టోర్నీలో స్వర్ణమో, రజతమో గెలిచిన క్రీడాకారులు తర్వాత డోప్‌ పరీక్షల్లో దొరికిపోవడం.. వారి తర్వాతి స్థానాల్లో ఉన్న వాళ్ల పతకం మెరుగుపడటం మామూలే. ఈ కోవలో మన మీరాబాయి చాను టోక్యోలో గెలిచిన రజతం.. స్వర్ణమయ్యే అవకాశాలున్నాయట. చైనాకు చెందిన హౌ జిజి స్వర్ణం నెగ్గింది. అయితే చాను సహా మిగతా లిఫ్టర్లు టోక్యో నుంచి స్వదేశాలకు బయల్దేరగా.. జిజిని మాత్రం డోప్‌ పరీక్ష కోసం అక్కడే ఉండాల్సిందిగా ఆదేశాలు అందినట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఆమె పరీక్షలో విఫలమైతే మీరాకు స్వర్ణం దక్కుతుంది.
చానుకు ఘనస్వాగతం: ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాబాయి చానుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. అభిమానుల హర్షాతిరేకాల మధ్య సోమవారం దిల్లీలోని ఇందిర గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చాను అడుగుపెట్టింది. ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు హోరెత్తుతుండగా చానుకు సాయ్‌ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కోచ్‌ విజయ్‌ శర్మతో కలిసి మీరా కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఇంటికి చేరుకుంది. అక్కడా ఆమెను మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా అనురాగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఒలింపిక్స్‌ తొలి రోజే పతకం. ఇంతకుముందెవరూ సాధించని ఘనత ఇది. 135 కోట్ల మంది ముఖాల్లో ఆమె నవ్వు తీసుకొచ్చింది. దేశమంతా ఆమెను చూసి గర్విస్తోంది’’ అని పేర్కొన్నారు.

అదనపు ఎస్పీగా చాను: ఒలింపిక్స్‌లో రజతంతో సత్తాచాటిన మీరాబాయి చానుకు పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా ఉద్యోగం కల్పిస్తున్నట్లు మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరెన్‌సింగ్‌ సోమవారం ప్రకటించారు. చానును అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమించనున్నట్లు తెలిపారు. ఆమెకు  రూ.1 కోటి నజరానాగా ఇవ్వనున్నట్లు చెప్పారు. జూడో క్రీడాకారిణి సుశీలాదేవికి కానిస్టేబుల్‌ నుంచి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తామని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన