చిన్న దేశం.. పెద్ద పతకం

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

చిన్న దేశం.. పెద్ద పతకం

ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే.. మన నగరాల కంటే తక్కువ జనాభా ఉన్న కొన్ని దేశాలు మాత్రం బంగారు పతకాలు పట్టేస్తున్నాయి. టోక్యో క్రీడల్లో పతకాలతో సత్తాచాటుతున్నాయి. ఒలింపిక్స్‌లో తొలి పసిడి పతకంతో బెర్ముడా  మెరిసింది. ఇస్తోనియా కూడా మంగళవారం పోడియంపై స్వర్ణంతో సగర్వంగా నిలబడింది.

ట్లాంటిక్‌ సముద్రంలోని ద్వీపమైన బెర్ముడా జనాభా కేవలం 65 వేలు మాత్రమే. ఇప్పుడు ఒలింపిక్స్‌ జరుగుతున్న టోక్యో ప్రధాన స్టేడియాన్ని వాళ్లతో నింపేసినా ఇంకా ఖాళీ స్టాండ్స్‌ కనిపిస్తాయి. అంత చిన్న దేశమైన బెర్ముడా ఈ ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విశ్వ క్రీడల చరిత్రలోనే పసిడి సాధించిన అతి చిన్న (జనాభా పరంగా) దేశంగా నిలిచింది. మహిళల ట్రయథ్లాన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఫ్లోరా డఫ్పీ ఆ దేశానికి తొలి ఒలింపిక్‌ స్వర్ణాన్ని అందించింది. టోక్యోకు ముందు 1976 క్రీడల్లో ఆ దేశ బాక్సర్‌ క్లారెన్స్‌ కాంస్యం గెలిచాడు. 13 లక్షల జనాభా మాత్రమే ఉండే ఐరోపా దేశం ఇస్తోనియా కూడా టోక్యోలో స్వర్ణాన్ని ముద్దాడింది. ఆ దేశ మహిళా ఫెన్సర్ల టీమ్‌ ఈపీఈఈ విభాగంలో దక్షిణ కొరియాను ఓడించి పసిడి అందుకుంది. మొత్తంగా ఆ దేశానికిది పదో ఒలింపిక్స్‌ స్వర్ణం. 2008 తర్వాత ఇదే మొదటి బంగారు పతకం. ఫెన్సింగ్‌లో ఆ దేశం ఛాంపియన్‌గా నిలవడమూ ఇదే తొలిసారి. మరోవైపు 10.8 కోట్ల జనాభా కలిగిన ఫిలిప్పీన్స్‌ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని అందుకుంది. మహిళల 55 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో డియాజ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. 97 ఏళ్ల నుంచి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఆ దేశానికి దక్కిన తొలి బంగారు పతకమిది. హాంకాంగ్‌, కొసోవో, ట్యూనీషియా లాంటి చిన్న దేశాలూ స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నాయి.

13 ఏళ్ల విరామం..

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో విఫలమవడంతో 33 ఏళ్ల ఫ్లోరా ట్రయథ్లాన్‌ను వదిలేసింది. ఆ తర్వాత తిరిగి ఆటలోకి వద్దామనుకున్న ఆమెకు గాయాలు, రక్తహీనత సమస్యగా మారాయి. దీంతో ఆటపై ధ్యాస వదిలేసిన ఆమె ఓ దుకాణంలో పని చేస్తూ డిగ్రీ పూర్తి చేసింది. కానీ ఆ తర్వాత మళ్లీ తన భర్త కోచ్‌గా ట్రయథ్లాన్‌ను మొదలెట్టింది. ఆటలో మెరుగయేందుకు పట్టుదలతో కృషి చేసింది. ఇప్పుడు బెర్ముడాకు తొలి ఒలింపిక్స్‌ పసిడి  అందించిన అథ్లెట్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన