ఒసాక.. ఒత్తిడి తట్టుకోలేక

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

ఒసాక.. ఒత్తిడి తట్టుకోలేక

టోక్యో: ఒలింపిక్స్‌లో జపాన్‌ స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమి ఒసాక ప్రయాణం ముగిసింది. క్రీడల ఆరంభానికి సూచికగా ఆమె  వెలిగించిన ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ జ్యోతి వెలుగుతూనే ఉండగా ఆమె ప్రస్థానం మాత్రం ఆగిపోయింది. సొంతగడ్డపై విశ్వ క్రీడల్లో తన దేశానికి పసిడి అందించాలనే ఆమె కల నెరవేరకుండా పోయింది. తొలిసారి ఒలింపిక్స్‌ బరిలో నిలిచిన ఈ రెండో సీడ్‌ ఒత్తిడికి తట్టుకోలేక మూడో రౌండ్లో పరాజయాన్ని మూటగట్టుకుంది. మంగళవారం ఒసాక  1-6, 4-6 తేడాతో అన్‌సీడెడ్‌ మార్కెటా వొండ్రోసోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో ఆమె పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేదు. అనవసర తప్పిదాలు చేసింది. తొలి సెట్‌ ఆరంభం నుంచి ఆమె తడబడింది. దీంతో ఓ దశలో 0-4తో వెనకబడింది. ఇదే అదునుగా తీసుకున్న ప్రత్యర్థి తొలి సెట్‌ సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో మొదట్లో జోరు చూపిన ఆమె.. ఆ తర్వాత మళ్లీ వెనకబడింది. ఓ దశలో కోర్టులో పూర్తి నిరాశతో కనిపించింది. చివరకు పరాజయంతో కోర్టును వీడింది. ‘‘ప్రతి ఓటమి నాకు నిరాశ కలిగిస్తుంది. కానీ ఈ పరాజయం మాత్రం అంతకంటే ఎక్కువగా బాధపెడుతోంది. మ్యాచ్‌ సందర్భంగా ఎంతో ఒత్తిడికి లోనయ్యా. గతంలో ఒలింపిక్స్‌ ఆడకపోవడమే అందుకు కారణం’’ అని ఓటమి అనంతరం ఒసాక తెలిపింది. మరోవైపు ఈ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో స్వర్ణంతో ‘గోల్డెన్‌ స్లామ్‌’ దిశగా బాటలు వేసుకోవాలనే పట్టుదలతో ఉన్న జకోవిచ్‌.. ఇప్పుడు మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ బరిలో దిగనున్నాడు. స్టోజనోవిచ్‌తో కలిసి అతను ఆడనున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన