గెలిచినా.. ఇంటికే

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

గెలిచినా.. ఇంటికే

సాత్విక్‌- చిరాగ్‌ జోడీ నిష్క్రమణ

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ డబుల్స్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌ శెట్టిల స్ఫూర్తిమంతమైన ప్రదర్శనకు తెరపడింది. గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో నెగ్గినా దురదృష్టం వెంటాడటంతో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది. మంగళవారం జరిగిన గ్రూప్‌-ఎ మూడో మ్యాచ్‌లో సాత్విక్‌- చిరాగ్‌ 21-17, 21-19తో బెన్‌ లేన్‌- సీన్‌ వెండీ (ఇంగ్లాండ్‌)పై విజయం సాధించారు. అంతకుముందు యాంగ్‌ లీ- లిన్‌ వాంగ్‌ (చైనీస్‌ తైపీ) మూడు గేమ్‌ల పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ మార్కస్‌ గిడియన్‌- కెవిన్‌ సుకుముజో (ఇండోనేసియా)పై గెలుపొందారు. దీంతో గ్రూప్‌-ఎలో మూడు జట్లు రెండేసి విజయాలతో సమంగా నిలిచాయి. అయితే అత్యధిక గేమ్‌ల గెలుపును ప్రాతిపదికగా నిర్దేశించడంతో భారత జోడీ మూడో స్థానంలో నిలిచి నాకౌట్‌ బెర్తును కోల్పోయింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఇండోనేసియా, చైనీస్‌ తైపీ జట్లు క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాయి. లండన్‌ ఒలింపిక్స్‌లో భారత మహిళల డబుల్స్‌ జోడీ గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్పకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గ్రూప్‌ దశలో మూడు జట్లు సమంగా నిలిచిన సమయంలో పాయింట్ల గెలుపోటముల ప్రాతిపదికన భారత జోడీకి నాకౌట్‌ బెర్తు చేజారింది.


సింధు.. మరో పోరు

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో పతక ఆశలు మోస్తున్న పీవీ సింధు మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం గ్రూప్‌- జె మ్యాచ్‌లో చెంగ్‌ యీ (హాంకాంగ్‌)తో తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసిన సింధు ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్రి క్వార్టర్స్‌ దిశగా మరో అడుగు వేసినట్లవుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రణీత్‌ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. మిక్స్‌డ్‌ టీమ్‌, పురుషుల జట్టు విభాగాల్లో విఫలమైన భారత ఆర్చర్లు వ్యక్తిగత అంశాల్లో పోటీకి సిద్ధమయ్యారు. రోయింగ్‌లో అద్భుత ప్రదర్శనతో సాగుతోన్న అర్జున్‌- అర్వింద్‌ జోడీ సెమీస్‌లో బరిలో దిగుతుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన