లవ్లీనా మరో అడుగేస్తే..

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

లవ్లీనా మరో అడుగేస్తే..

క్వార్టర్స్‌లో ప్రవేశం

పతకానికి చేరువైన భారత బాక్సర్‌

ఒక్క అడుగు చాలు.. లవ్లీనా బొర్గోహెన్‌ మెడలో పతకం పడటానికి! స్ఫూర్తిదాయక ప్రదర్శనతో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించిన ఈ యువ బాక్సర్‌.. పతకానికి చేరువైంది. మంగళవారం హోరాహోరీగా సాగిన 69 కిలోల ప్రిక్వార్టర్స్‌ పోరులో లవ్లీనా 3-2తో నడీన్‌ అప్టెజ్‌ (జర్మనీ)పై విజయం సాధించింది. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఈ అసోం అమ్మాయి.. బౌట్‌ తొలి రౌండ్లో దూకుడుగా ఆడింది.   ఆ తర్వాత రౌండ్లో వ్యూహాన్ని మార్చి రక్షణాత్మకంగా ఆడిన లవ్లీనా.. చివరి రౌండ్లో పదునైన ఎడమ చేతి పంచ్‌లతో ఎదురుదాడి చేసి ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆఖరి రౌండ్లో మాజీ ఐరోపా ఛాంపియన్‌ అప్టెజ్‌ నుంచి గట్టిపోటీనే ఎదురైనా.. ఒత్తిడిని తట్టుకుంటూ నిలిచిన భారత బాక్సర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో 2019 ఆసియా ఛాంపియన్‌షిప్‌ రజత పతక విజేత నీన్‌ చిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో లవ్లీనా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ పోరులో లవ్లీనా గెలిస్తే.. సెమీస్‌ చేరడం ద్వారా పతకం ఖాయం చేసుకోనుంది.

టీటీలో ఖేల్‌ ఖతం

టేబుల్‌టెన్నిస్‌లో భారత్‌ కథ ముగిసింది. బరిలో మిగిలిన ఆచంట శరత్‌కమల్‌ కూడా పరాజయం చవిచూశాడు. పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో శరత్‌ 7-11, 11-8, 11-13, 4-11, 4-11తో చైనా దిగ్గజ ఆటగాడు మా లాంగ్‌ చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌లో ఓడినా.. అద్భుతమైన విన్నర్లతో రెండో గేమ్‌ గెలుచుకున్న శరత్‌.. మూడో గేమ్‌ను పోరాడి చేజార్చుకున్నాడు. కానీ అక్కడ నుంచి విజృంభించిన లాంగ్‌.. కమల్‌కు మరో అవకాశం ఇవ్వకుండా ఆడి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. శరత్‌ కన్నా ముందు మనిక, సుతీర్థ, సత్యన్‌ నిష్క్రమించడం తెలిసిందే.

సెయిలింగ్‌లో వెనుకంజ

సెయిలింగ్‌లోనూ భారత క్రీడాకారులది వెనుకంజే. ఆరు రేసులు పూర్తయ్యేసరికి ఓవరాల్‌గా నేత్ర కుమనన్‌ 22వ స్థానంలో నిలవగా.. విష్ణు శరవణన్‌ 33వ స్థానంలో కొనసాగుతున్నారు. మంగళవారం లేజర్‌ రేడియల్‌లో రెండు రేసుల్లో పాల్గొన్న నేత్ర.. 32, 38 స్థానాల్లో నిలిచింది. రెండు రేసుల్లో విష్ణు 23, 22 స్థానాల్లో నిలిచాడు.

* టెన్నిస్‌లో ఇప్పటికే భారత్‌ పోరాటం ముగిసినా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఏమైనా అవకాశం ఉంటుందా అన్న ఆశలకు కూడా తెరపడింది. కంబైన్డ్‌ ర్యాంకు 153గా ఉన్న సానియామీర్జా (9)-సుమిత్‌ నగాల్‌ (144) మంగళవారం ప్రకటించిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ డ్రాలో చోటు దక్కించుకోలేకపోయారు.


హాకీలో అదిరే విజయం

హాకీలో భారత పురుషుల జట్టు అదరగొట్టింది. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 1-7తో చిత్తుగా ఓడిన మన్‌ప్రీత్‌ బృందం.. ఆ ఓటమి నుంచి వేగంగా కోలుకుని ఘన విజయాన్ని అందుకుంది. పూల్‌-ఏ పోరులో భారత్‌ 3-0తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. ఆట ఆరంభం నుంచే భారత్‌ హవా మొదలైంది. తొలి 16 నిమిషాల్లోపే మన జట్టు రెండు గోల్స్‌ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (14వ నిమిషం) కొట్టిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్‌.. ఆ తర్వాత నిమిషంలోనే రూపిందర్‌పాల్‌ సింగ్‌ చేసిన మెరుపు గోల్‌తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత పటిష్టమైన డిఫెన్స్‌తో స్పెయిన్‌ గోల్‌ అవకాశాలను అడ్డుకున్న భారత్‌.. రూపిందర్‌ పాల్‌ (51వ నిమిషం) కొట్టిన మరో గోల్‌తో ఆధిక్యాన్ని 3-0కు పెంచుకుంది. అదే జోరు ఆఖరిదాకా ప్రదర్శించి ప్రత్యర్థికి ఒక్క గోల్‌ కూడా ఇవ్వకుండానే మ్యాచ్‌ను ముగించింది. గురువారం జరిగే పోరులో ఒలింపిక్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాను భారత్‌ ఢీకొంటుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన