ఒలింపిక్స్‌ సందడే లేదు

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

ఒలింపిక్స్‌ సందడే లేదు

‘ఈనాడు’తో భారత రోయింగ్‌ జట్టు కోచ్‌ ఇస్మాయిల్‌ బేగ్‌

ఈనాడు - హైదరాబాద్‌

టోక్యోలో ఒలింపిక్స్‌ సందడే కనిపించడం లేదని భారత రోయింగ్‌ జట్టు కోచ్‌, ద్రోణాచార్య, తెలుగువాడు ఇస్మాయిల్‌ బేగ్‌ అన్నాడు. కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా క్రీడల్ని ఎలాగోలా ముగించేయాలన్న తాపత్రయమే కనిపిస్తోందని తెలిపాడు. భారత రోయింగ్‌ జట్టు సెమీస్‌ చేరుకోవడంతో తమ లక్ష్యం నెరవేరిందని చెప్పాడు. సిడ్నీ (2000) నుంచి టోక్యో వరకు ఆరు ఒలింపిక్స్‌లకు అర్హత సాధించిన భారత జట్టుకు బేగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 5 ఒలింపిక్స్‌లు ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో టోక్యోపై తన అభిప్రాయాల్ని బేగ్‌ ‘ఈనాడు’తో పంచుకున్నాడు.

క్రీడాగ్రామంలో వసతులు ఎలా ఉన్నాయి?

కరోనా రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉన్న 14 దేశాలపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. క్రీడాగ్రామంలో 14 దేశాల బృందాలను రెండో అంతస్తులో ఉంచారు. అక్కడే భోజనం ఏర్పాటు చేశారు. క్వారంటైన్‌ పూర్తవగానే మిగతా క్రీడాకారుల మాదిరే వసతి కల్పించారు. క్రీడాగ్రామంలో మాస్కు తప్పనిసరి. భోజనశాలలో ప్రతి టేబుల్‌పై గ్లాస్‌ తెర ఏర్పాటు చేశారు. 10 అడుగులకో సానిటైజర్‌.. ఉష్ణోగ్రత కొలిచే థర్మామీటర్‌ ఉంచారు.

ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించలేదు.. క్రీడాగ్రామంలోనైనా సందడి నెలకొందా?

టోక్యోలో వాతావరణం ఒలింపిక్స్‌ మాదిరిగా లేదు. మాకైతే కళ్లకు గంతలు కట్టినట్లుగా ఉంది. క్రీడాగ్రామం నుంచి సాధన, పోటీలకు మళ్లీ క్రీడాగ్రామానికి వస్తున్నాం. మరెక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. బస్సులో ఉన్నంతసేపే టోక్యో రోడ్లను చూడొచ్చు. అత్యవసర స్థితి విధించడంతో రోడ్డుపై కూడా ఎవరూ ఉండరు. రోడ్లు, భవనాలను చూడటమే. స్టేడియాలు పూర్తిగా ఖాళీనే. క్రీడాకారులు, అధికారులు, వలంటీర్లు తప్పితే సాధారణ జనాన్ని ఇప్పటి వరకు చూడలేదు. క్రీడాగ్రామం, స్టేడియాల్లోనూ కరోనా నిబంధనలు ఉన్నాయి. క్రీడాకారుల మధ్య సరదా సన్నివేశాలు, కబర్లు లేనేలేవు. అసలు ఒలింపిక్స్‌ సందడే లేదు. భారత క్రీడాకారులంతా ఒకే దగ్గర ఉంటున్నా.. ఎవరి సమయాలు వారివి.

కరోనా తీవ్రత నేపథ్యంలో క్రీడాకారుల మానసిక స్థితి ఎలా ఉంది?

ఒలింపిక్స్‌ జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి.. అంతే. ఎలాగోలా పూర్తిచేయాలనే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అర్హత సాధించిన క్రీడాకారులు, శిష్యులకు తర్ఫీదునిచ్చిన కోచ్‌లు, విధులు నిర్వర్తిస్తున్న సాంకేతిక అధికారులు, నిర్వాహకులతో సహా అందరి అభిప్రాయం అలాగే ఉంది. ఒలింపిక్స్‌ కోసం ప్రతి ఒక్కరు కనీసం రెండేళ్లుగా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఒక ఏడాది క్రీడలు వాయిదా పడ్డాయి. ఈసారి వాయిదా అంటే క్రీడలు రద్దయినట్లే. 2024కు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో! త్వరగా తమ ఈవెంట్‌ను ముగించుకుని వెళ్లాలన్న అభిప్రాయంతోనే అత్యధికులు ఉన్నారు.

భారత రోయింగ్‌ జట్టు సెమీస్‌ చేరుకుంది. మీ తర్వాతి లక్ష్యం ఏంటి?

ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరుకోవాలన్నది మా లక్ష్యం. దాన్ని అందుకున్నాం. బుధ, గురువారాల్లో సెమీస్‌ రేసులు ఉన్నాయి. పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు కాబట్టి స్వేచ్ఛగా పోటీల్లో పాల్గొంటాం. సెమీస్‌లో బలమైన ప్రత్యర్థులు ఉన్నారు. ఫైనల్‌కు వెళ్తే గొప్ప ఘనత కిందే లెక్క. సెమీస్‌లో ఓడితే 7-12 స్థానాల కోసం జరిగే రేసులో పాల్గొంటాం. మంచి స్థానం కోసం ప్రయత్నిస్తాం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన