పూజ పవర్‌ పంచ్‌

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

పూజ పవర్‌ పంచ్‌

క్వార్టర్స్‌లో ప్రవేశం

మరో అడుగేస్తే పతకమే

టోక్యో

తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న బాక్సర్‌ పూజారాణీ సత్తా చాటింది. తన పవర్‌ పంచ్‌లతో ఈ అమ్మాయి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. ఏకపక్షంగా సాగిన మహిళల 75 కిలోల ప్రిక్వార్టర్స్‌లో పూజ 5-0తో ఇక్‌రాక్‌ కాయిబ్‌ (అల్జీరియా)ను చిత్తు చేసింది. ఈ బౌట్‌ ఆరంభం నుంచి తన కుడి చేతి పంచ్‌లతో విరుచుకుపడిన భారత బాక్సర్‌.. తనకన్నా 10 ఏళ్ల జూనియర్‌ అయిన ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. రాణీ పంచ్‌లకు ఒకటి రెండుసార్లు కాయిబ్‌ కిందపడింది. కచ్చితమైన షాట్లతో ఆమె పాయింట్లు సాధించగా.. కాయిబ్‌ మాత్రం పూజ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. మూడు రౌండ్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన పూజ చివరికి విజయహాసం చేసింది. 31న జరిగే క్వార్టర్స్‌లో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లి క్విన్‌ (చైనా)తో రాణీ అమీతుమీ తేల్చుకోనుంది. 2014 ఆసియా క్రీడలు, ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో పూజపై క్విన్‌ పైచేయి సాధించింది.


హాకీలో హ్యాట్రిక్‌ ఓటమి

హాకీలో భారత మహిళల జట్టుకు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. పూల్‌-ఎ పోరులో రాణీ రాంపాల్‌ బృందం 1-4 గోల్స్‌తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రిటన్‌ చేతిలో ఓడింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బ్రిటన్‌ 20 నిమిషాలలోపే రెండు గోల్స్‌ కొట్టేసింది. రెండో నిమిషంలోనే హనా మార్టిన్‌ గోల్‌ చేయడంతో ఆధిక్యంలోకి వెళ్లిన బ్రిటన్‌.. ఆ తర్వాత హనా మరోసారి బలమైన షాట్‌తో బంతిని గోల్‌లోకి పంపడంతో ఆధిక్యాన్ని రెట్టింపు   చేసుకుంది. 12వ నిమిషంలో భారత్‌కు రెండు పెనాల్టీకార్నర్లు దక్కగా అవి వృథా అయ్యాయి. అయితే 23వ నిమిషంలో భారత్‌ ఖాతా తెరిచింది. షర్మిల గోల్‌ కొట్టిన మెరుపు షాట్‌తో భారత్‌ 1-2తో నిలిచింది. ఆ తర్వాత మూడో క్వార్టర్‌లో భారత్‌కు దక్కిన మూడు పెనాల్టీకార్నర్లూ వృథా అయ్యాయి.వోస్లీ (41వ ని) కొట్టిన గోల్‌తో 3-1తో ఆధిక్యాన్ని పెంచుకున్న బ్రిటన్‌.. చివర్లో పెనాల్టీ స్ట్రోక్‌ను గ్రేస్‌ (57వ ని) గోల్‌గా మలచడంతో ఘన వి విజయాన్నందుకుంది. వరుసగా మూడో ఓటమితో భారత్‌కు క్వార్టర్స్‌ దారులు మూసుకుపోయినట్లే. 

అట్టడుగు స్థానంలో సెయిలర్లు: భారత సెయిలర్లు గణపతి, వరుణ్‌ ఓవరాల్‌గా అట్టడుగు స్థానంలో నిలిచారు. పురుషుల స్కిఫ్‌ రేసులో భారత జోడీ 18వ స్థానాన్ని సాధించింది. బుధవారం మూడు రేసుల్లో పాల్గొన్న భారత సెయిలర్లు వరుసగా 18, 17, 19 స్థానాల్లో నిలిచారు. లేజర్‌ రేడియల్‌ సెయిలింగ్‌లో ఆరు రేసుల తర్వాత విష్ణు శరవణన్‌ 22, నేత్ర కుమనన్‌ 33 స్థానాల్లో ఉన్నారు.


రేసులో దీపిక

ఆర్చరీలో మిక్స్‌డ్‌ విభాగంలో విఫలమైన దీపిక కుమారి సింగిల్స్‌లో ముందంజ వేసింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మహిళల రికర్వ్‌ సింగిల్స్‌ తొలి రౌండ్లో 6-0తో కర్మా (భూటాన్‌)ను చిత్తుగా ఓడించిన దీపిక.. ఉత్కంఠభరితంగా సాగిన రెండో రౌండ్లో జెన్నిఫర్‌ ఫెర్నాండెజ్‌పై 6-4తో విజయాన్ని అందుకుంది. కర్మాపై వరుసగా మూడు సెట్లలో అలవోకగా గెలిచిన దీపిక.. రెండో రౌండ్లో మాత్రం కాస్త కష్టపడింది. తొలి సెట్‌ను 25-26తో చేజార్చుకున్న దీపిక..రెండు (28-25), మూడు (27-25) సెట్లలో గెలిచి ఆధిక్యంలో నిలిచింది. కానీ నాలుగో సెట్లో ఫెర్నాండెజ్‌ 25-24తో గెలవడంతో ఉత్కంఠ నెలకొంది. ఫలితాన్ని తేల్చే అయిదో సెట్‌లో వరుసగా 9, 9, 8, పాయింట్లు సాధించిన దీపిక 26-25తో నెగ్గి ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌దీప్‌, ప్రవీణ్‌ జాదవ్‌ పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో 6-0తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ బజర్‌హపోవ్‌ (రష్యా)ను కంగుతినిపించిన ప్రవీణ్‌.. రెండో రౌండ్లో బ్రాడీ (అమెరికా) చేతిలో 0-6తో ఓడిపోయాడు. తొలి రౌండ్లో నెగ్గిన తరుణ్‌దీప్‌.. రెండో రౌండ్లో 5-6తో షానీ (ఇజ్రాయిల్‌) చేతిలో ఓడాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన