సింధూ సాగిపో..

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 05:44 IST

సింధూ సాగిపో..

క్వార్టర్స్‌లో తెలుగుతేజం
ప్రిక్వార్టర్స్‌లో బ్లిక్‌ఫెల్ట్‌పై ఘనవిజయం
టోక్యో

మెరుపు వేగం.. కచ్చితత్వంతో షాట్లు.. పదునైన స్మాష్‌లు.. ఎదురులేని స్ట్రోక్‌లు.. షటిల్‌పై సంపూర్ణ నియంత్రణ. మొత్తంగా ఆల్‌రౌండ్‌ విన్యాసం. ఒక్కమాటలో చెప్పాలంటే సింధు తన అత్యుత్తమ ప్రదర్శన చేసింది. అదిరిపోయే ఆటతో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో చోటు కోసం శుక్రవారం జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగూచితో అమీతుమీ తేల్చుకోనుంది.

టోక్యో ఒలింపిక్స్‌ను సాధారణంగా మొదలుపెట్టిన ప్రపంచ ఛాంపియన్‌ పి.వి. సింధు ఒక్కసారిగా సింహనాదం చేసింది. కళ్లముందున్న ప్రత్యర్థి హడలిపోయేలా.. తర్వాత ఎదురయ్యే పోటీదారులు బెంబేలెత్తేలా చెలరేగి ఆడింది. గ్రూపు దశలో తొలి రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గట్లు ఆడని సింధు నాకౌట్‌ పోరులో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. గురువారం మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్లో ఆరో సీడ్‌ సింధు 21-15, 21-13తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ మియా బ్లిక్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)ను చిత్తుచేసింది. గట్టి పోటీ తప్పదనుకున్న ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని అవలీలగా సింధు మట్టికరిపించింది.  41 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సింధు ధాటికి ప్రత్యర్థి విలవిలలాడింది. తొలి గేమ్‌లో మొదటి రెండు పాయింట్లను కోల్పోయిన సింధుకు మ్యాచ్‌ను నియంత్రణలోకి తెచ్చుకోడానికి ఎంతోసేపు పట్టలేదు. గేరు మార్చి.. వేగం పెంచి బ్లిక్‌ఫెల్ట్‌కు చుక్కలు చూపించింది. క్రాస్‌కోర్ట్‌, డ్రాప్‌ షాట్లతో చెలరేగింది. 6-4తో ముందంజ వేసిన సింధు 11-6తో స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. అయితే తర్వాతి ఏడు పాయింట్లలో ఆరు పాయింట్లు నెగ్గిన బ్లిక్‌ఫెల్ట్‌ పుంజుకున్నట్లే కనిపించింది. సింధు అనవసర తప్పిదాలు కూడా ఆమెకు కలిసొచ్చాయి. వెంటనే వ్యూహం మార్చిన సింధు వరుస పాయింట్లతో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. 16-15తో పైచేయి సాధించిన సింధు వరుసగా అయిదు పాయింట్లు నెగ్గి 21-15తో తొలి గేమ్‌ కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధు ఆట ముందు బ్లిక్‌ఫెల్ట్‌ పూర్తిగా తేలిపోయింది. తొలి పాయింటు కోసం సుదీర్ఘంగా సాగిన ర్యాలీలో సింధు పైచేయి సాధించింది. ఆ పాయింటుతోనే ప్రత్యర్థి మ్యాచ్‌ను వదిలేసుకున్నట్లుగా అనిపించింది. స్మాష్‌లతో చెలరేగిన సింధు 5-0తో ఆధిక్యం సంపాదించింది. చూస్తుండగానే 9-4తో మరింత ముందుకెళ్లింది. సింధు సంధించే స్మాష్‌లకు ప్రత్యర్థి దగ్గర సమాధానాలే లేకుండా పోయాయి. కోర్టులో నలువైపులా రాకెట్‌ వేగంతో కదిలిన సింధు షటిల్‌ను సమర్థంగా అవతలి కోర్టులోకి నెట్టింది. 11-6తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు వరుసగా పాయింట్లు సాధించింది. తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిన బ్లిక్‌ఫెల్ట్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-13తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను సింధు సొంతం చేసుకుంది. బ్లిక్‌ఫెల్ట్‌పై తన గెలుపోటముల రికార్డును 5-1తో మరింత మెరుగు పరుచుకుంది.


బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌
(సింధు × యమగూచి) మధ్యాహ్నం 1.15 నుంచి


యమగూచితో నేడు అమీతుమీ

నాకౌట్‌లో అద్భుత విజయంతో ఆకట్టుకున్న సింధుకు శుక్రవారం అసలైన పరీక్ష ఎదురుకానుంది. స్థానిక క్రీడాకారిణి, స్వర్ణం గెలిచే సత్తా ఉన్న యమగూచితో క్వార్టర్‌ఫైనల్లో సింధు తలపడనుంది. యమగూచిపై 11-7తో మెరుగైన గెలుపోటముల రికార్డు ఉండటం సింధుకు కలిసొచ్చే అంశం. చివరి సారిగా వీరిద్దరు ఈ ఏడాది ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్స్‌లో తలపడ్డారు. 76 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధుదే పైచేయి అయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అయిదో స్థానంలో ఉన్న యమగూచి ఫామ్‌లో కూడా లేదు. సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌లో తీవ్రమైన ఒత్తిడి యమగూచికి అదనపు భారం కావడం ఖాయం. టెన్నిస్‌లో నవోమి ఒసాకా, బ్యాడ్మింటన్‌లో కెంటొ మొమొట నిష్క్రమణలే ఇందుకు నిదర్శనం. వీరిద్దరు తమ క్రీడాంశాల్లో కచ్చితంగా స్వర్ణం గెలుస్తారని జపాన్‌తో సహా యావత్‌ క్రీడా ప్రపంచం గట్టిగా నమ్మింది. కాని తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆరంభ రౌండ్లలోనే ఇంటిముఖం పట్టారు. శుక్రవారం యమగూచి పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. ఆమె ఒత్తిడికి తలొగ్గితే సింధు పని మరింత సులువవుతుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన