ప్రపంచ రికార్డుతో పసిడి

ప్రధానాంశాలు

Published : 31/07/2021 03:04 IST

ప్రపంచ రికార్డుతో పసిడి

టోక్యో: ఒలింపిక్స్‌ ఈతలో అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతూ టోక్యోలో ఇతర దేశాలు పతకాలు సాధిస్తున్నాయి. శుక్రవారం నాలుగు పతకాంశాల్లో పోటీపడ్డ అమెరికా ఒక్క దాంట్లోనూ స్వర్ణం నెగ్గలేదు.

మహిళల 200మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికా స్విమ్మర్‌ తత్జన షూన్‌మాకర్‌.. ప్రపంచ రికార్డుతో పసిడి పట్టేసింది. 2 నిమిషాల 18.95 సెకన్లలో రేసు ముగించిన ఆమె అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా స్విమ్మర్లు లిల్లీ (2:19.92సె), లాజర్‌ (2:20.84సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ ఒలింపిక్స్‌ స్మిమ్మింగ్‌ వ్యక్తిగత విభాగంలో నమోదైన తొలి ప్రపంచ రికార్డు ఇది.

రష్యా కూడా..: పురుషుల 200మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రష్యా ఒలింపిక్‌ కమిటీ స్విమ్మర్‌ రీలవ్‌ (1:53.27సె) ఒలింపిక్స్‌ రికార్డుతో స్వర్ణం గెలిచాడు. రియో క్రీడల్లో రెండు బంగారు పతకాలు గెలిచిన అమెరికా స్విమ్మర్‌ ర్యాన్‌ (1:54.15సె) ఈ సారి రెండో స్థానానికే పరిమితమయ్యాడు. ల్యూక్‌ (బ్రిటన్‌- 1:54.72సె) మూడో స్థానంలో నిలిచాడు.

మెరిసిన మెక్‌కియాన్‌: మహిళల 100మీ. ఫ్రీస్టైల్‌లో అగ్రస్థానంలో నిలిచిన మెక్‌కియాన్‌ (51.96సె) ఆస్ట్రేలియాకు స్విమ్మింగ్‌లో మరో స్వర్ణాన్ని అందించింది. ఒలింపిక్స్‌ రికార్డుతో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది. బెర్నాడెట్‌ (హాంకాంగ్‌- 52.27సె), క్యాంప్‌బెల్‌ (ఆస్ట్రేలియా- 52.52సె) వరుసగా వెండి, కంచు పతకాలు నెగ్గారు. మహిళల స్విమ్మింగ్‌ వ్యక్తిగత విభాగాల్లో ఆస్ట్రేలియా ఇప్పటివరకూ నాలుగు బంగారు పతకాలు గెలిచింది. పురుషుల 200మీ. వ్యక్తిగత మెడ్లీలో ఒక్క నిమిషం 55 సెకన్లలో రేసు పూర్తి చేసిన వాంగ్‌ (చైనా) పసిడి సొంతం చేసుకున్నాడు. స్కాట్‌ (బ్రిటన్‌- 1:55.28సె), జెరెమీ (స్విట్జర్లాండ్‌- 1:56.17సె) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన