ఆరు నిమిషాల్లో దీపిక ఔట్‌

ప్రధానాంశాలు

Updated : 31/07/2021 05:01 IST

ఆరు నిమిషాల్లో దీపిక ఔట్‌

టోక్యో

దీపిక కుమారికి తీవ్ర నిరాశ.. మూడో ఒలింపిక్స్‌లోనైనా పతకం సాధించాలనుకున్న ఆమె కల భగ్నమైంది. ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్చర్‌ క్వార్టర్‌ఫైనల్లోనే నిష్క్రమించింది. దీపిక 0-6తో ఆన్‌సాన్‌ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. 6 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో తొలి సెట్లో తప్ప.. మిగిలిన రెండు సెట్లలో దీపిక దారుణంగా విఫలమైంది. తొలి సెట్లో రెండు పదుల స్కోర్లు చేసినా ఆమె 27-30తో కోల్పోయింది. ఇక రెండో సెట్లో పదితో ప్రారంభించిన దీపిక.. రెండు ఏడు స్కోర్లు చేసి 24-26తో సెట్‌ చేజార్చుకుంది. మూడో సెట్‌ను 24-26తో కోల్పోయిన ఆమె ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది.

హాకీలో రెండో స్థానం: హాకీలో భారత పురుషుల జట్టు జోరు కొనసాగుతోంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనను చేస్తూ మన్‌ప్రీత్‌ సేన హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. పూల్‌-ఎ ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 5-3తో ఆతిథ్య జపాన్‌ను ఓడించింది. ఇప్పటికే క్వార్టర్స్‌ బెర్తును ఖరారు చేసుకున్న భారత్‌.. పూల్‌-ఎలో ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మహిళల హాకీలో క్వార్టర్స్‌ చేరే అవకాశాలను భారత్‌ సజీవంగా ఉంచుకుంది. గ్రూపు పోరులో రాణీ రాంపాల్‌ బృందం 1-0తో ఐర్లాండ్‌పై గెలిచింది.

బాకర్‌కు రిక్తహస్తమే: ఈ ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో బరిలో దిగిన స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ రిక్తహస్తాలతో వెనుదిగింది. 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌లో తొలిరోజు అయిదో స్థానంలో నిలిచి ఆశలు రేపిన బాకర్‌.. ర్యాపిడ్‌ విభాగంలో విఫలమై ఫైనల్‌ చేరలేకపోయింది. మొత్తం మీద మను (582 పాయింట్లు) 15వ స్థానంతో పోటీని ముగించింది. మరో షూటర్‌ రహీ సర్నోబాత్‌ (573) 32వ స్థానంలో నిలిచింది.

అవినాశ్‌ జాతీయ రికార్డు నెలకొల్పినా..: ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో తొలిరోజు భారత్‌కు కలిసి రాలేదు. 3000 మీటర్ల స్టీఫుల్‌ ఛేజ్‌లో అవినాశ్‌ సాబ్‌లె జాతీయ రికార్డు సృష్టించినా ఫైనల్‌ చేరడంలో విఫలయ్యాడు. హీట్స్‌లో   8 నిమిషాల 18.12 సెకన్లలో రేసు పూర్తి చేసిన అవినాశ్‌... తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు   (8 నిమిషాల 20.20 సెకన్లు)ను మెరుగుపరిచాడు. 100 మీటర్ల పరుగు హీట్స్‌లో ద్యుతీచంద్‌ 11.54 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచి ముందంజ వేయలేకపోయింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌, 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలోనూ భారత్‌కు ప్రతికూల  ఫలితాలే ఎదురయ్యాయి. 400 మీటర్ల హర్డిల్స్‌ హీట్స్‌లో ఎంపీ జబీర్‌ 50.77సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో భారత్‌ హీట్స్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన