ఆమె రూటే వేరు

ప్రధానాంశాలు

Updated : 31/07/2021 03:23 IST

ఆమె రూటే వేరు

ఈనాడు క్రీడావిభాగం

రింగ్‌లో దూకుడు.. పంచ్‌లో పదును.. అదను కోసం ఎదురుచూసే ఓపిక.. శత్రువుని పడగొట్టే వ్యూహం.. ఇవన్నీ కలగలిపితే లవ్లీనా. ఎన్నో ఆశలతో.. మరెన్నో అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన ఈ 23 ఏళ్ల అస్సాం బాక్సర్‌ అద్భుత ప్రదర్శనతో పతకాన్ని ఖాయం చేసింది. కరోనాను ఓడించి ఒలింపిక్స్‌కు సిద్ధమైన ఈ యువ పంచ్‌ కిరణం అదే స్ఫూర్తితో ఒక్కో ప్రత్యర్థిని దాటుతూ ముందడుగు వేస్తోంది.

కరోనా దెబ్బకొట్టినా..: పేద కుటుంబం నుంచి వచ్చిన లవ్లీనా మొదటి నుంచే   ఓ యోధురాలు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె ముఖం వెనక.. ప్రత్యర్థులపై ముష్టిఘాతాలు విసిరి విజయాలు సాధించాలనే ఓ బలమైన వ్యక్తిత్వం ఉంది. క్రమశిక్షణతో, అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగింది. అస్సాంలోని గోలాఘాట్‌ జిల్లా బారో ముఖియా అనే ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఈ యువ బాక్సర్‌.. ఒలింపిక్స్‌లో పోడియంపై నిలబడే స్థాయికి చేరుకోవడం వెనక స్ఫూర్తి కలిగించే ప్రయాణముంది. తన కవల అక్కలు లీచా, లీమా బాటలో నడుస్తూ మొదట కిక్‌ బాక్సర్‌గా కెరీర్‌ను మొదలెట్టిన లవ్లీనా.. ఆ తర్వాత అమెచ్యూర్‌ బాక్సర్‌గా మారింది. సాయ్‌ ట్రయల్స్‌లో కోచ్‌ బోరోను ఆకట్టుకోవడంతో ఆమెకు బాక్సింగ్‌లో తలుపులు తెరుచుకున్నాయి. పంచ్‌లపై పట్టుతో.. రింగ్‌లో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ దూసుకొచ్చింది. వరుసగా రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ కాంస్యాలతో సత్తాచాటింది. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. టోక్యో క్రీడలకు ముందు కీలకమైన శిక్షణ కోసం మిగతా బాక్సర్లంతా ఐరోపా వెళ్తే.. లవ్లీనా మాత్రం కరోనా పాజిటివ్‌గా తేలడంతో భారత్‌లోనే ఉండిపోయింది. గతేడాది చివర్లో కిడ్నీ మార్పిడి చేసుకున్న తన తల్లి దగ్గర ఆమె కొన్ని రోజులు గడిపింది. శిక్షణ కోసం ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు ఐరోపాకు బయల్దేరే ఒక రోజు ముందు లవ్లీనాకు వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో ఆమె ప్రయాణాన్ని రద్దు చేసుకోక తప్పలేదు. సహచర బాక్సర్లందరూ ఐరోపా వెళ్తే తాను మాత్రం ఇక్కడ ఒంటరిగా మిగిలింది. ఓ వైపు దేశంలో వైరస్‌ తీవ్రత కారణంగా సాధన చేసే అవకాశం లేకపోవడం.. మరోవైపు కీలక ఒలింపిక్స్‌కు ముందు కరోనా బారిన పడడంతో ఆ దశలో లవ్లీనా నిరాశకు లోనైంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ముందు సరైన సాధన చేయలేమోనని భయపడింది. కానీ మహమ్మారి నుంచి కోలుకున్న ఆమె సాధన కోసమనే అస్సాంలో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కానీ సహచర బాక్సర్లు లేకపోవడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో సాధన చేయలేకపోయింది. అందుకే గత నెలలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్స్‌ తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది (అయినప్పటికీ తక్కువ మంది బాక్సర్లు మాత్రమే పోటీలో ఉండడంతో కాంస్యం వచ్చింది). ఆ పరాజయం తనలో మరింత పట్టుదలను పెంచింది. ఇక అప్పటి నుంచి రింగ్‌లోనే రోజులు గడిపింది. సాధనను తీవ్రతరం చేసింది. భయాన్ని వదిలించుకుని.. ధైర్యంగా టోక్యోలో అడుగుపెట్టింది. అదే సంకల్పంతో వరుసగా రెండు బౌట్లలోనూ ప్రత్యర్థులను చిత్తుచేసి సత్తాచాటింది. గతంలో తనపై నాలుగుసార్లు గెలిచిన ప్రపంచ మాజీ ఛాంపియన్‌ను క్వార్టర్‌ఫైనల్లో చిత్తుగా ఓడించి ప్రపంచానికి తన పంచ్‌ పవర్‌ను చాటింది.

3
ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలవనుంది. 2008లో విజేందర్‌, 2012లో మేరీకోం కాంస్యాలు నెగ్గారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన