కొత్త చిరుత ఎవరో?

ప్రధానాంశాలు

Published : 01/08/2021 03:20 IST

కొత్త చిరుత ఎవరో?

పురుషుల 100 మీ. ఫైనల్‌ నేడే

టోక్యో: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మనిషిని తేల్చే పోటీకి సమయం ఆసన్నమైంది. ఒలింపిక్స్‌కే అత్యంత ఆకర్షణగా నిలిచే పురుషుల వంద మీటర్ల పరుగు పోటీ ఆదివారమే. గత మూడు ఒలింపిక్స్‌లోనూ ఉసేన్‌ బోల్ట్‌ మెరుపులతో ప్రపంచం ఊగిపోగా.. నాలుగేళ్ల కిందట ట్రాక్‌కు టాటా చెప్పేసిన అతను ప్రేక్షకుల్లో ఒకడిగా మారిపోయాడు. బోల్ట్‌ ఉన్నంత కాలం రెండో స్థానం ఎవరిదా అని చూసేవాళ్లందరూ. కానీ ఇప్పుడు ఉసేన్‌ స్థానాన్ని భర్తీ చేసే కొత్త చిరుత ఎవరా అన్న ఆసక్తి నెలకొంది. స్వయంగా బోల్టే ఈసారి 100 మీటర్ల విజేత కాగలడని అంచనా వేసిన అమెరికా వీరుడు బ్రోమెల్‌ టైటిల్‌ సాధిస్తాడా..? గత ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి, ఈసారి పసిడే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కెనడా కుర్రాడు డిగ్రాస్‌ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడా..? ఒకప్పుడు బోల్ట్‌కు గట్టి పోటీ ఇచ్చి ఆ తర్వాత ప్రదర్శన తగ్గిన జమైకా యోధుడు యొహాన్‌ బ్లేక్‌ టోక్యోలో అవకాశాన్ని ఉపయోగించుకుంటాడా..? అమెరికా నుంచి మరో గట్టి పోటీదారైన రోనీ బేకర్‌ నయా ఛాంపియన్‌ అవుతాడా..? కొత్తగా ఆశలు రేకెత్తిస్తున్న అకానె సింబైన్‌ (దక్షిణాఫ్రికా) లేదా జార్నెల్‌ హ్యూస్‌ (గ్రేట్‌ బ్రిటన్‌) పసిడి పట్టుకుపోతారా..? మరి వీరిలో టోక్యో ఛాంపియన్‌ ఎవరవుతారో చూడాలి. ఎవరు గెలుస్తారన్న ఆసక్తికి తోడు.. ఎంత టైమింగ్‌తో గెలుస్తారు.. ప్రపంచ, ఒలింపిక్‌ రికార్డులేమైనా బద్దలవుతాయా.. బోల్ట్‌ రికార్డులకు ఎవరైనా దగ్గరగా వస్తారా అన్నది ఆసక్తికరం. ఏదేమైనా ఆ పది క్షణాల ఉత్కంఠను అనుభవించడానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.20కి ఫైనల్‌ కాగా.. అంతకంటే ముందు సెమీస్‌ జరుగుతాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన