పసిడి చూస్తామా..?

ప్రధానాంశాలు

Updated : 02/08/2021 12:16 IST

పసిడి చూస్తామా..?

రజతం సాధించింది.. కాంస్యం అందుకుంది.. మరి పసిడిని ముద్దాడుతుందా..? బంగారు కలను సింధు నెరవేర్చుకుంటుందా..?  అయిదేళ్ల క్రితం రియోలో ఫైనల్లో మారిన్‌ చేతిలో ఓడి.. రజతంతో దేశానికి ఆనందాన్ని అందించిన ఆమె.. టోక్యోలో కాంస్యంతో మరోసారి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఈ సారి స్వర్ణమే లక్ష్యంగా బరిలో దిగిన ఆమెకు.. సెమీస్‌లో తై జు యింగ్‌ రూపంలో కఠిన సవాలు ఎదురైంది. ఆ గండాన్ని దాటలేకపోయిన తను.. కాంస్య పతక పోరులో విజయంతో పోడియంపై నిల్చుంది. అయితే ఒలింపిక్స్‌లో సింధు పసిడి కల తీరేందుకు మరో అవకాశం కనిపిస్తోంది. అదే.. పారిస్‌ ఒలింపిక్స్‌. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో క్రీడలు 2021లో జరగడంతో.. 2024లో ఆరంభమయ్యే పారిస్‌ ఒలింపిక్స్‌కు ఇంకో మూడేళ్ల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం  26 ఏళ్లున్న సింధుకు.. అప్పటికీ 29 ఏళ్లు వస్తాయి. ప్రస్తుత ఫామ్‌, ఫిట్‌నెస్‌ చూస్తుంటే ఆమె ఆ క్రీడల్లోనూ స్వర్ణానికి పోటీదారే అనడంలో సందేహం లేదు. ఇప్పుడు అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో ఉన్న ఆమె దానిపై మరింత దృష్టి పెట్టి ఆటలో నిలకడగా ముందుకు సాగితే కచ్చితంగా పారిస్‌ విమానం ఎక్కే అవకాశం ఉంది. ఆ క్రీడల్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తే స్వర్ణం సాధించాలనే స్వప్నం సాకారమవ్వొచ్చు. అయితే అదేం సులభం కాదు. ఈ మూడేళ్లు ఆమె తీవ్రంగా శ్రమించాలి. గాయాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. ఆటను ఎప్పటికప్పుడూ మెరుగుపర్చుకుంటూ సాగాలి. ప్రత్యర్థులకు అందకుండా ఉండేందుకు కొంగొత్త వ్యూహాలతో బరిలో దిగాలి. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. వచ్చే ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఆ దిశగా తన ప్రయాణం సరికొత్తగా మొదలెడితే ఆ విశ్వ క్రీడల కిరీటాన్ని అందుకునే ప్రయత్నం చేయొచ్చు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన