అమ్మాయిలూ.. అదరగొట్టేయండి

ప్రధానాంశాలు

Updated : 04/08/2021 03:26 IST

అమ్మాయిలూ.. అదరగొట్టేయండి

నేడు రెండు సెమీస్‌ పోరాటాలు

హాకీలో అర్జెంటీనాతో మహిళల పోరు

బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌తో లవ్లీనా ఢీ

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎంతో కీలకమైన రెండు సమరాలకు రంగం సిద్ధమైంది. సంచలన ప్రదర్శనలతో ఇప్పటికే పతకం ఖాయం చేసిన బాక్సర్‌ లవ్లీనా.. పతకానికి అడుగు దూరంలో ఉన్న మహిళల హాకీ జట్టు భవితవ్యం తేల్చే సెమీస్‌ పోరాటాలు నేడే. లవ్లీనా.. ప్రపంచ ఛాంపియన్‌, టర్కీ క్రీడాకారిణి బుసానెజ్‌ సుర్మనెలిని ఢీకొంటుండగా.. హాకీ అమ్మాయిలు అర్జెంటీనాతో తలపడనున్నారు.


ఇంకో అద్భుతం చేస్తారా?

లీగ్‌  దశలో భారత మహిళల హాకీ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాక.. వరుసగా రెండు విజయాలతో అనూహ్యంగా క్వార్టర్స్‌ చేరడమే కాదు.. నాకౌట్‌ మ్యాచ్‌లో మూడుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై విజయం సాధించడం పెను సంచలనమే. ఏడు పెనాల్టీ కార్నర్లు సహా దాదాపు పది గోల్‌ ప్రయత్నాలను ఆపి ఆస్ట్రేలియాకు షాకిచ్చింది రాణీ రాంపాల్‌ సేన. భారత మహిళల హాకీ చరిత్రలోనే ఈ విజయం ఎప్పటికీ నిలిచిపోయేదే. అయితే ఈ విజయానికి మరింత సార్థకత వచ్చేది పతకంతోనే. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అగ్ర జట్టు అర్జెంటీనాను భారత అమ్మాయిలు ఢీకొంటున్నారు. గెలుపంత సులువు కాదు కానీ.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో చూపించిన పట్టుదలను కొనసాగిస్తే, ఆత్మవిశ్వాసంతో ఆడితే ఫైనల్‌ చేరడం అసాధ్యమేమీ కాదు. మరి పురుషుల జట్టులా కాకుండా అమ్మాయిలు ముందడుగు వేస్తారేమో చూద్దాం.


ఏ రంగు?

నాలుగు రోజుల కిందట 69 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ చిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై సంచలన విజయంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని ఖాయం చేసిన లవ్లీనా.. బుధవారం కఠిన సవాల్‌కు సిద్ధమైంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ అయిన బుసానెజ్‌ను ఆమె ఢీకొంటోంది. ఈ పోరులో గెలుపు అంత తేలిక కాదు. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించడమంటే మాటలు కాదు. కానీ లవ్లీనా ఫామ్‌ చూస్తే ఆమె విజయాన్ని కొట్టి పారేయలేం. గతంలో తనతో తలపడ్డ నాలుగుసార్లూ ఓటమి రుచి చూపిన చిన్‌ చెన్‌కు క్వార్టర్స్‌లో షాకిచ్చిన లవ్లీనా.. అదే ఊపులో బుసానెజ్‌పైనా నెగ్గి స్వర్ణ పోరుకు అర్హత సాధిస్తుందని అభిమానుల ఆశ. ఈ బౌట్‌లో ఓడినా ఆమెకు కాంస్యం దక్కుతుంది.  మరి లవ్లీనా టోక్యో నుంచి ఏ రంగు  పతకంతో స్వదేశానికి చేరుతుందో చూడాలి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన