పేస్‌ పంచ్‌

ప్రధానాంశాలు

Published : 05/08/2021 02:48 IST

పేస్‌ పంచ్‌

 విజృంభించిన బుమ్రా, షమి

ఇంగ్లాండ్‌ 183కే ఆలౌట్‌.. భారత్‌ 21/0

తొలి టెస్టులో కోహ్లీసేన శుభారంభం

ఓవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఓటమి.. మరోవైపు ప్రాక్టీస్‌ లేమి.. ఇంకోవైపు గాయాల బాధలు.. అన్నింటికీ మించి ఇంగ్లాండ్‌లో గత పర్యటనల తాలూకు చేదు అనుభవాలు.. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్‌ జట్టుతో టెస్టు సిరీస్‌లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన కోహ్లీసేన.. తొలి టెస్టు తొలి రోజు ఆశ్చర్యకర ప్రదర్శన చేసింది. పేసర్లు సమష్టిగా సత్తా చాటడంతో ఆతిథ్య జట్టును తొలి రోజు భారత్‌ 183 పరుగులకే కుప్పకూల్చి పైచేయి సాధించింది. ఆట ఆఖరుకు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 21/0తో నిలిచింది.

నాటింగ్‌హామ్‌

ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా గొప్పగా ఆరంభించింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌ను పూర్తిగా సద్వినియోగం చేస్తున్న బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 65.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌట్‌ చేశారు. బుమ్రా (4/46), షమి (3/28) ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. శార్దూల్‌ (2/41), సిరాజ్‌ (1/48) కూడా రాణించారు. ఇంగ్లాండ్‌ జట్టులో కెప్టెన్‌ జో రూట్‌ (64; 108 బంతుల్లో 11×4) ఒక్కడే రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌.. 13 ఓవర్లు ఆడి 21/0తో నిలిచింది. ఓపెనర్లు రోహిత్‌ (9 బ్యాటింగ్‌), రాహుల్‌ (9 బ్యాటింగ్‌) జాగ్రత్తగా ఆడి తొలి రోజు భారత్‌ పూర్తి పైచేయి సాధించేలా చూశారు. రెండో రోజు పూర్తిగా భారత్‌ బ్యాటింగ్‌ చేస్తే మ్యాచ్‌పై పట్టు చిక్కినట్లే.

మధ్యలో మలుపు..: ఇంగ్లాండ్‌ ఇంత తక్కువ స్కోరుకు ఆలౌట్‌ కావడంలో పూర్తి ఘనత భారత పేసర్లకే కట్టబెట్టాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. వాటిని బౌలర్లు ఉపయోగించుకున్న తీరు ప్రశంసనీయం. ఆరంభం నుంచి కట్టు తప్పకుండా క్రమశిక్షణతో బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించారు. ఇంగ్లాండ్‌ జట్టులో ఎల్బీడబ్ల్యూలు అయిదు కాగా.. ఒకరు బౌల్డయ్యారు. ముగ్గురు వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చారు. దీన్ని బట్టే బౌలర్ల క్రమశిక్షణను అర్థం చేసుకోవచ్చు. ఆడటానికి వీల్లేని బంతులేసి బ్యాట్స్‌మెన్‌ వికెట్లు ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించారు. బంతిని బౌన్స్‌ చేయడంతో పాటు స్వింగ్‌ చేయడంలోనూ పేసర్లు విజయవంతమయ్యారు. అయితే తొలి రోజు ఆటలో సగం వరకు ఇంగ్లాండ్‌ జట్టు మంచి స్థితిలోనే ఉంది. టీ విరామానికి కాస్త ముందు ఆ జట్టు స్కోరు 138/3. బుమ్రా తొలి ఓవర్లోనే రోరీ బర్న్స్‌ (0)ను వికెట్ల ముందు బలిగొని భారత్‌కు అదిరే ఆరంభాన్నివ్వగా.. క్రీజులో నిలదొక్కుకున్న క్రాలీని (27)ను లంచ్‌ విరామానికి ముందు సిరాజ్‌ వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో ఔట్‌ చేశాడు. రెండో సెషన్‌ ఆరంభంలోనే సిబ్లీ (18) వికెట్‌ను షమి పడగొట్టాడు. 66/3తో కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్‌.. రూట్‌, బెయిర్‌ స్టో (29)ల శ్రమతో కోలుకుంది. ఇద్దరూ క్రీజులో బాగా నిలదొక్కుకుని స్వేచ్ఛగా షాట్లు ఆడటం మొదలుపెట్టారు. ఇక ఈ జోడీకి తిరుగులేదనుకుంటుండగా.. టీ విరామానికి ముందు షమి లెంగ్త్‌ డెలివరీతో బెయిర్‌స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది. విరామానంతరం ఓవర్‌ కొనసాగిస్తూ చివరి బంతికి లారెన్స్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు షమి. బట్లర్‌ (0) సైతం ఖాతా తెరవకుండానే బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 155 పరుగుల వద్ద శార్దూల్‌ అద్భుతమైన డెలివరీతో రూట్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి భారత్‌ను సంతోషంలో ముంచెత్తాడు. సామ్‌ కరన్‌ (27 నాటౌట్‌; 37 బంతుల్లో 4×4, 1×6) ధాటిగా ఆడి స్కోరు పెంచినా.. అవతల వికెట్ల పతనం కొనసాగింది. బుమ్రా యార్కర్లతో టెయిలెండర్లను బెంబేలెత్తించాడు. అండర్సన్‌ (1)ను ఆ బంతితోనే బౌల్డ్‌ చేసి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఈ మ్యాచ్‌కు గాయం వల్ల ఇషాంత్‌ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో సిరాజ్‌ను ఎంచుకున్నారు. తుది జట్టులో ఒక స్పిన్నర్‌కే చోటిచ్చిన భారత్‌.. అశ్విన్‌ను కాకుండా జడేజాను తీసుకుంది. నాలుగో పేసర్‌గా శార్దూల్‌, ఓపెనర్‌గా రాహుల్‌ అవకాశం దక్కించుకున్నారు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: రోరీ బర్న్స్‌ ఎల్బీ (బి) బుమ్రా 0; సిబ్లీ (సి) రాహుల్‌ (బి) షమి 18; క్రాలీ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 27; రూట్‌ ఎల్బీ (బి) శార్దూల్‌ 64; బెయిర్‌స్టో ఎల్బీ (బి) షమి 29; లారెన్స్‌ (సి) పంత్‌ (బి) షమి 0; బట్లర్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; సామ్‌ కరన్‌ నాటౌట్‌ 27; ఓలీ రాబిన్సన్‌ (సి) షమి (బి) శార్దూల్‌ 0; బ్రాడ్‌ ఎల్బీ (బి) బుమ్రా 4; అండర్సన్‌ (బి) బుమ్రా 1; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (65.4 ఓవర్లలో ఆలౌట్‌) 183

వికెట్ల పతనం: 1-0, 2-42, 3-66, 4-138, 5-138, 6-145, 7-155, 8-155, 9-160

బౌలింగ్‌: బుమ్రా 20.4-4-46-4; షమి 17-2-28-3; సిరాజ్‌ 12-2-48-1; శార్దూల్‌ 13-3-41-2; జడేజా 3-0-11-0Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన