ఇక్కడితో ముగియలేదు ఇంకా చాలా ఉంది

ప్రధానాంశాలు

Published : 05/08/2021 02:48 IST

ఇక్కడితో ముగియలేదు ఇంకా చాలా ఉంది

నంబర్‌వన్‌, ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: రియో, టోక్యో ఒలింపిక్స్‌లలో తాను సాధించిన పతకాలు ఎంతో మందిలో స్ఫూర్తి రగిలిస్తాయని అనుకుంటున్నట్లు భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు తెలిపింది. బుధవారం హైదరాబాద్‌ తిరిగొచ్చిన సింధు విలేకరులతో ముచ్చటించింది. వివరాలు ఆమె మాటల్లోనే..


కష్టం, త్యాగాలే కారణం

రెండు ఒలింపిక్స్‌ పతకాలతో అందరి ముందు నిల్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్థితిలో ఉండటానికి కష్టం, త్యాగాలే కారణం. నేను, కుటుంబ సభ్యులు, నా బృందం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. మరెన్నో త్యాగాలు చేశాం. కరోనా నేపథ్యంలో శారీరకంగా ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం.. మానసికంగా దృఢంగా ఉండటం కోసం చాలా కష్టపడ్డా. లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నా. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త అస్త్రాలు సంధిస్తానని ముందే చెప్పా. అనుకున్నట్లే అత్యుత్తమంగా ఆడా. 2016 రియో ఒలింపిక్స్‌ తర్వాత జీవితం ఎంతో మారిపోయింది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. అంచనాలు, ఒత్తిడి నడుమ టోక్యోలో బాధ్యతగా ఆడా. పతకం సాధించి గర్వంగా అందరి ముందుకు వచ్చా.


కలలు కన్నాం

ఎంత కష్టమైనా తట్టుకుని నిలబడితే విజయం సాధ్యమవుతుంది. ఒలింపిక్స్‌ పతకం అంటే మామూలు విషయం కాదు. టోక్యోలో పతకం సాధించాలని ప్రతి ఒక్కరం కలలు కన్నాం. టోక్యో కంటే ముందే రియో ఒలింపిక్స్‌లో రజతం వచ్చింది. అయినా టోక్యోను తేలిగ్గా తీసుకోలేదు. అయిదేళ్లు మరింత ఎక్కువగా కష్టపడ్డాం. అనుకున్నది సాధించాం. ఇక్కడితో ముగియలేదు. ఇంకా చాలా ఉంది. ప్రపంచ నంబర్‌వన్‌గా నిలవాలి. పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలి. భవిష్యత్తులో ఇవే నా లక్ష్యాలు. ప్రస్తుతం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత అంతర్జాతీయ టోర్నీల్లో బరిలో దిగుతా.


ఎంతోమందికి స్ఫూర్తి

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం గొప్ప ఘనతే. ఈ పతకాలు ఎంతో మందిలో స్ఫూర్తి రగిలిస్తాయని భావిస్తున్నా. చాలామంది ఆటను కెరీర్‌గా ఎంచుకుటారని అనుకుంటున్నా. బ్యాడ్మింటన్‌కు ఆదరణ కూడా పెరుగుతుంది. ఏడాదిన్నరగా కోచ్‌ పార్క్‌, నేను పతకం కోసం కష్టపడ్డాం. రానున్న రోజుల్లోనూ ఇది కొనసాగుతుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన