బల్లెం వీరా భళా

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 05:16 IST

బల్లెం వీరా భళా

క్వాలిఫయింగ్‌లో భారత జావెలిన్‌ త్రోయర్‌ మెరుపులు

గ్రూప్‌లో అగ్రస్థానంతో ఫైనల్‌కు అర్హత

ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఏకైక ఆశ నీరజ్‌ చోప్రా. జూనియర్‌ స్థాయి నుంచే ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతూ టోక్యో ఒలింపిక్స్‌లో పతకం తేగలడని అంచనాలు రేకెత్తిస్తున్న ఈ జావెలిన్‌ త్రోయర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫయింగ్‌ రౌండ్లో అతడు అగ్రస్థానంలో నిలిచాడు.

టోక్యో

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో తొలి అడుగును ఘనంగా వేశాడు. బుధవారం క్వాలిఫయింగ్‌ రౌండ్లో అతను 86.65 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి సునాయాసంగా ఫైనల్‌ చేరుకున్నాడు. మరో 15 మంది క్రీడాకారులతో కలిసి తాను పోటీపడ్డ గ్రూప్‌-ఎలో నీరజ్‌ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఫైనల్‌కు చేరడానికి అర్హత మార్కు 83.50 మీటర్లు కాగా.. నీరజ్‌ తొలి ప్రయత్నంలోనే అంతకన్నా 3.15 మీటర్లు ఎక్కువే బల్లాన్ని విసిరి ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు. మరో భారత జావెలిన్‌ త్రోయర్‌ శివ్‌పాల్‌ సింగ్‌ పేలవ ప్రదర్శనతో గ్రూప్‌-బిలో 12వ స్థానానికి పరిమితం అయ్యాడు. అతను అత్యుత్తమంగా 76.40 మీటర్లు మాత్రమే జావెలిన్‌ను విసరగలిగాడు. శనివారం జరగనున్న ఫైనల్‌కు అర్హత సాధించిన 12 మందిలో నీరజ్‌ కంటే ఉత్తమ వ్యక్తిగత ప్రదర్శన ఉన్న క్రీడాకారులు నలుగురున్నారు. జర్మనీ అథ్లెట్‌ జొహానెస్‌ వెటెర్‌ ఉత్తమ ప్రదర్శన 97.76 మీటర్లు కావడం గమనార్హం. ఫైనల్‌కు అర్హత సాధించిన మరే క్రీడాకారుడూ ఇప్పటిదాకా ‘90’ మార్కును అందుకోలేదు. క్వాలిఫయింగ్‌ రౌండ్‌ తొలి రెండు ప్రయత్నాల్లో వెటెర్‌ తడబడ్డాడు. అర్హత మార్కును అందుకోలేకపోయాడు. ఒత్తిడి మధ్య మూడో ప్రయత్నంలో 85.64 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. నీరజ్‌ అత్యుత్తమ ప్రదర్శన 88.07 మీటర్లు కాగా.. వెటెర్‌ కాకుండా జాకబ్‌ వాద్లెచ్‌ (89.73 మీ.) వెస్లీ విలెస్లావ్‌ (చెక్‌ రిపబ్లిక్‌- 88.34 మీ.), జులియన్‌ వెబర్‌ (జర్మనీ-88.29 మీ.) అతడి కంటే మెరుగైన ప్రదర్శనతో ఉన్నారు. మరి ఫైనల్లో వీరి పోటీని తట్టుకుని నీరజ్‌ పతకం సాధిస్తాడేమో చూడాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన